calender_icon.png 9 November, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం

09-11-2025 05:34:04 PM

చిట్యాల (విజయక్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2015-16 విద్యాసంవత్సరం నుండి 2024–25 వరకు చదువుకున్న పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశం ఆదివారం స్థానిక రైతు వేదికలో రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు చెన్నూరు నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసమావేశంలో గ్రామస్తులు, నాయకులు, యువకులు, పూర్వ విద్యార్థులు హాజరై విద్యార్థులు, యువతకు ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని చర్చించి నిర్ణయించారు.

ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసి, స్వయం ఉపాధి లేదా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలను పొందేలా కృషి చేయడం, ఇందుకోసం ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ ద్వారా సహకారం అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్నత చదువులు కొనసాగిస్తున్న విద్యార్థులకు మార్గనిర్దేశనం, చదువు ఆపేసిన పూర్వ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని సమిష్టిగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం రమాదేవి, ఉపాధ్యాయుడు వెంకట్ రావు, పలువురు గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.