25 March, 2026 | 2:48 AM

చౌరస్తాలో అమరావతి

25-03-2026 01:12 AM

ఊహలు కొండంత.. ఆచరణ గోరంత

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం దేవతావస్త్రాలనే సామెత చందంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ప్రసంగాల్లో అమరావతిని అద్భుత నగరం, గ్లోబల్ సిటీ అంటూ అభివర్ణిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్నది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఐఎస్‌బీ సమ్మిట్‌లో అమరావతి ఆత్మగౌరవానికి చిహ్నమని, యుద్ధ ప్రాతిపదికన రాజధాని పనులు జరుగుతున్నాయని చెప్పటినప్పటికీ, ఇప్పటికీ అక్కడ పునాదులు దాటి ఒక్క అడుగైనా ముందుకు పడలేదనేది వాస్తవం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని పట్టించుకోలేదని, పైగా విధ్వంసాన్ని సృష్టించిందని సీఎం రొడ్డకొట్టుడు ప్రసంగాలు చేస్తున్నారే తప్ప.. ఆచరణలో మాత్రం అడుగులు అంతంతమాత్రం.

పనులకు రూ.66 వేల కోట్లు కేటాయించామని సీఎం చెప్తున్నప్పటికీ, ఆ పనులు ఎక్కడ జరుగుతున్నాయనేది మాత్రం ఆ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు. వెరసి అమరావతి అభివృద్ధి నేడు చౌరాస్తాలో నిలబడి ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నది. కేంద్రం లో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమితో జట్టు కట్టినప్పటికీ, కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఎలాం టి పని చేయించుకోలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గాడి తప్పిన అంచనాలు 

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అక్కడి ప్రజల్లో అమరావతిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో నిలిచిపోయిన పనులన్నీ, ఇక యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయని అందరూ భావించారు. కానీ, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. రాజధాని ప్రాంతంలో కేవలం కార్యాలయ భవనం తప్ప భారీ నిర్మాణాలేవీ కంటికి కనిపించడం లేదు.

దీంతో అభివృద్ధి అంతా కేవలం కాగితాలకు, ఫైళ్లకు మాత్రమే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమ రావతిపై సీఎం నెలకు రెండు మూడు సార్లు సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, పైసాప్రయోజనం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు ఆలస్యం చేస్తున్నా, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదని సమాచారం.

ఆర్టీఐ సమాచారం కోరినా.. నో రిప్లు

అమరావతి పనులకు సంబంధించిన టెం డర్ల వివరాలు, పనుల పురోగతిపై కొందరు ఆర్టీఐ ద్వారా అడిగినా, అధికారుల నుంచి సరైన సమాధానం ఇవ్వడం లేదనే ఆరోపినలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధం గా కొన్ని సంస్థలకు ఎక్కువ రేట్లకు కాంట్రాక్టు లు ఇస్తున్నారనే వాదనలూ ఉన్నాయి. ఏదేమైనా, సీఆర్డీయేని ప్రత్యేక ప్రభుత్వ శాఖగా మారిస్తే, తప్ప పనులు ముందుకు పడవనే అభిప్రాయం నిపుణుల నుంచి వస్తున్నది. కేవలం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సా మాజిక వర్గాలను సంతృప్తి పరిచే పనులు పక్కన పెట్టి, సత్వరం పనులు చేపట్టేందుకు చ ర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నది.

గ్రాఫిక్స్‌తో కాలక్షేపం 

మొదటి దఫా అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతి విషయంలో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం అనే విధమైన ప్రచారం చేశారు. అప్పట్లో సినీ దర్శకుడు రాజమౌళిని పిలిపించి మరీ అసెంబ్లీ, హైకోర్టు భవనాల ఆకృతులపై చర్చలు జరపడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఒక రాజధాని నగరాన్ని నిర్మించడం కంటే, సినిమా సెట్టింగుల తరహాలో గ్రాఫిక్స్ చిత్రాలకే ప్రాధాన్యమిచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. నాడు సింగపూర్, లండన్ నగరాల తరహా చిత్రాలను చూపించి ప్రజలను భ్రమల్లో ముంచెత్తారు. ఇప్పుడు మళ్లీ అదే పంథాలో ‘స్మార్ట్ సిటీ’, ‘బ్లూ- గ్రీన్ సిటీ’ అంటూ కొత్త పదాలతోనే సీఎం పబ్బం గడుపుకొంటున్నారు.

సీఆర్డీఏ కమిషనర్ల నియామకంలో సామాజిక సమీకరణాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీఎం చంద్రబాబునాయుడు తొలుత సీఆర్డీయే కమిషనర్‌గా కమ్మ సామాజికవర్గం నుంచి కాటమనేని భాస్కర్‌ను నియమించారు. మంత్రి నారాయణతో విభేదాల కారణంగా ఆయన్ను పెక్కనపెట్టారు. ఆ తర్వాత కాపు సామాజికవర్గానికి చెందిన అధికారి కె.కన్నబాబును నియమించారు. ఇప్పుడు, ఆయన్ను కూడా పక్కనపెట్టి, 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విజయరామరాజును నియమించారు.

ఈయన రాజుల సామాజికవర్గానికి చెందిన వారు. దీన్నిబట్టి సీఎం రాజధాని పనుల కంటే, సామాజికవర్గ సమీకరణాలు, నియామకాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ముగ్గురు సీఆర్డీఏ కమిషనర్లను మార్చడం పాలనలో ఉన్న అస్థిరతకు నిదర్శనం. కులాల వారీగా అధికారులను మారు స్తూ, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం వల్ల రాజధాని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది.

యుద్దప్రాతిపదికన పనులు

‘అమరావతి కేవలం ఒక రాజధాని కాదు. అది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నం. గడిచిన ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును నాశనం చేసేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పనులను ఎక్కడైతే ఆగిపోయాయో, అక్కడి నుంచే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించబోతున్నాం. గతంలో మా మాస్టర్‌ప్లాన్‌ను కొందరు గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేశారు. మేం ఇప్పుడు వాటిని నిజం చేస్తాం. అమరావతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ‘స్మార్ట్ సిటీ’గా, ‘బ్లూ-గ్రీన్’ ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. రూ.60,000 కోట్ల నిధులతో ఈ పనులు చేపడతాం. అమరావతి నగరమే రాబోయే తరాలకు మేం ఇచ్చే అస్తి’

  హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో 22న జరిగిన ‘సౌత్ ఆసియా లెర్నింగ్ సమ్మిట్’లో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు