కొండగట్టు శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై పరిశీలన
జగిత్యాల, మార్చి 24 ( విజయక్రాంతి ) :కొండగట్టు శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కొండగట్టు ఆలయ పరిసరాల్లో నిర్వహించనున్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను ప్రత్యక్షంగా సమీక్షించారు.జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.అదేవిధంగా, పార్కింగ్ సదుపాయాలు సరిపడా ఉండేలా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డిపివో మదన్ మోహన్, ఆలయ ఏవో అంజనా రెడ్డి, ఎమ్మార్వోలు , ఎంపిడివోలు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




