16 July, 2026 | 3:01 AM

లక్ష కోట్లతో అమరావతి!

07-06-2024 02:09 AM

ప్రణాళికల తయారీలో చంద్రబాబునాయుడు

కేంద్రం వాటా.. ప్రైవేటు ఈక్విటీలపై మంతనాలు

మాజీ సీఎం జగన్ పక్కనపెట్టిన ఫైళ్లపై దృష్టి

సీఎంవోకు అధికారుల బృందంపై నజర్

రెండు రోజులుగా మకాం వేసిన 

సింగపూర్‌కు చెందిన అమరావతి డిజైన్ సంస్థ

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): పదేండ్లుగా రాజధాని కోసం నలువైపులా పరుగులు తీస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు ఎట్టకేలకు అమరావతినే శాశ్వత రాజధానిగా చేసేందుకు తాజాగా కొలువుదీరనున్న ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజధాని నిర్మాణం చేపట్టాలని టీడీపీ అధినేత, ఏపీ కాబోయే సీఎం చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. రాజధానిగా అమరావ తిని ప్రపంచ నగరాలకు ధీటుగా నిర్మించేలా ప్రణాళికలను రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. సుమారు రూ.లక్ష కోట్లతో రాజధానిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

పక్కాగా ప్రణాళికలు

తాజా ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన రాజధాని విషయంలో వెంటనే పనులు ప్రారంభించాలని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వామి కావడంతో అక్కడి నుంచి కూడా తగిన సహాయం లభిస్తుందని, డిమాండ్ చేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతో భారీ ప్రణాళికలు వేస్తున్నారు. రూ.లక్ష కోట్లతో రాజధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సన్నిహితులతో చంద్రబాబు అన్నట్టు తెలిసింది.

కేంద్రం నుంచి ఎంతవరకు సహాయం అందే అవకాశం ఉంది? రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ప్రైవేటు సంస్థల నుంచి ఎంతమేరకు ఆర్థిక వనరులను సమీకరించే అవకాశం ఉంది? అనే అంశాలపై కూడా సన్నిహితులతో చర్చించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వంలో చేరనున్న నేపథ్యంలో ఇప్పటికే తమ డిమాండ్లను బీజేపీ అధిష్ఠానానికి టీడీపీ అందించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని, లేదా ఆర్థికపరమైన సహాయం అందించాలనేది అందులో ప్రధానంగా ఉంటుందని చర్చ జరుగుతోంది.

కేంద్రం నుంచి రాజధాని నిర్మాణానికి వీలైనంత ఎక్కువ ఆర్థిక వనరులు సాధించాలని బాబు ఎత్తులు వేస్తున్నారు. ప్రత్యేక హోదా కాకుండా ఆర్థిక వనరులన (ప్యాకేజీ రూపంలో) అందించే అవకాశం ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమరావతికి సంబం ధించిన పూర్తి డిజైన్ చంద్రబాబు వద్ద ఉంది. అప్పట్లో అమరావతి నగరానికి డిజైన్ చేసిన సింగపూర్ సంస్థ కూడా రెండుమూడు రోజులుగా అమరావతిలో తిష్టవేసి నట్టు సమాచారం. చంద్రబాబు సన్నిహితులతో సంస్థ ప్రతినిధులు మంతనాలు సాగించినట్టు తెలిసింది. 

గత ప్రభుత్వం పట్టించుకోని ఫైళ్లపై దృష్టి

రాష్ట్ర విభజన జరిగిన తరువాత మొదట చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన పలు ప్రాజెక్టులను ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్ పక్కనపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ ఆ ఫైళ్ల దుమ్ము దులుపుతున్నట్టు తెలిసింది. వెళ్లూరుకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ విట్‌కు గతంలో కేటాయించిన 250 ఎకరాలకు సంబంధించిన ఫైలు కూడా చంద్రబాబు పరిశీలనకు వెళ్లినట్టు సమాచారం.

అమరావతి డిజైన్లు తయారుచేసిన సింగపూర్ సంస్థ ఫైలును కూడా బాబు తెప్పించుకుని పరిశీలించినట్టు తెలిసింది. సవిత గ్రూప్ కూడా చంద్రబాబు సన్నిహితవర్గంతో టచ్‌లోకి వచ్చినట్టు చెప్పుకుంటు న్నారు. ఇవేకాకుండా ప్రధానంగా రాష్ట్రం ఏర్పడిన మొదటి ఐదేండ్లలో తాము చేపట్టాలనుకున్న ప్రాజెక్టుల్లో జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిన ఫైళ్లపై తాజాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో ఐదేండ్ల క్రితంవరకు చంద్రబాబు ప్రభుత్వంతో టచ్‌లో ఉన్న ప్రాజెక్టులు, సంస్థల ప్రతినిధులు మరోసారి ఆయన ముందు వాలుతున్నారు.