16 July, 2026 | 2:55 AM

‘కాళేశ్వరం’పై నివేదిక దిశగా..

07-06-2024 02:10 AM

నేడు కాళేశ్వరంలో పీసీ ఘోష్, ఉత్తమ్ పర్యటన

ప్రాజెక్టుపై కమిషన్‌కు ౫౪ ఫిర్యాదులు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై అధ్యయనం

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 6 (విజయక్రాంతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతిని తేల్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిసింది. బరాజ్ నిర్మాణంలో నిర్ణయా త్మక పాత్ర పోషించిన అధికారులు, ఇంజినీర్లు మాజీ ప్రజాప్రతినిధులకు రెండు, మూడు వారాల్లో నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 10లోపు బరాజ్ మరమ్మతు పనులను పూర్తిచేయాలని కోరిన నేపథ్యంలో నిపుణుల కమిటీ సైతం ఇప్ప టికే బరాజ్‌ల స్థితిగతులను పరిశీలించింది.

ఆ పనులు ఎంతమేర చేపట్టా రన్న విషయాలను తెలుసుకోవడానికి పీసీ ఘోష్ శుక్ర, శనివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఇది లా ఉండగా మేడిగడ్డ బరాజ్‌లో 16, 17వ గేట్లను పైకి ఎత్తే ప్రక్రియ ఇంజినీర్లు మొదలుపెట్టారు. ఈఎన్సీ గుమ్మడి అనిల్‌కుమార్‌తో పాటు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారి ఓరుగంటి మోహన్‌కుమార్ కూడా మేడిగడ్డను సందర్శిం చనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. కడెం ప్రాజెక్టులో రూ.3.81 కోట్లతో జరుగుతున్న మరమ్మతు పనులను ఆయన పరిశీలిస్తారు. అక్కడి నుంచి సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌లకు చేరుకుని మరమ్మతు పనులను పరిశీలిస్తారు.