calender_icon.png 11 December, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెజాన్ భారీ పెట్టుబడులు

11-12-2025 12:14:18 AM

  1. 2030 నాటికి భారత్‌లో 3.14 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్
  2. 10 లక్షల మందికి కొలువుల కల్పనే లక్ష్యం

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: భారత్‌లో 2030 నాటికి 3.14లక్షల పెట్టుబడులు పెడుతామని, 10లక్షల ఉద్యోగాలను కల్పించడమే తమ లక్ష్యమని అమెజాన్ ప్రకటించింది. భారత్‌లో అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. 2030 నాటికి ఇండియాలో వివిధ వ్యాపారాల్లో దాదాపు 35 బిలియన్ల డాలర్లు (రూ.3.14లక్షల కోట్లు) పెట్టుబడులు పెడతామని దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ పేర్కొంది.

వ్యాపార విస్తరణతో పాటు ఉపాధి కల్పన కోసం ఈ ప్రణాళికలను ప్రకటించింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అమెజాన్ ‘సంభవ్ సంభవ్’ సమ్మిట్‌లో ఈ మేరకు పెట్టుబడులపై ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లలో ఏకంగా 10లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ధ్యేయమని చెప్పింది. గడిచిన 15 ఏళ్లలో అమెజాన్ సంస్థ భారత్‌లో 40 బిలియన్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది.

భారత్‌లోని విస్తృత డిజిటల్, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ఏఐ ఆధారిత డిజిటలైజేషన్, ఉద్యోగాల సృష్టి ఎగుమతుల్లో వృద్ధి లక్ష్యంగా ఈ పెట్టుబడులను పెడతామని తాజాగా అమెజాన్ వెల్లడించింది. ఈ సంస్థ ఇప్పటి వరకు 12లక్షల వ్యాపారాలను డిజిటలైజేషన్ చేసిందని, 2024లో దాదాపు 2.8మిలియన్ల మందికి ప్రత్యక్ష, పరోక్ష, సీజనల్ వారీగా ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వివరించింది. 2030 నాటికి మరో 10 లక్షల ఉద్యోగాలను కల్పించమే లక్ష్యమని పేర్కొంది.

భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, చిన్న మధ్యతరహా వ్యాపారాలను డిజిటల్ మార్గంలో ముందుకు తీసుకెళ్లడం, ఉద్యోగ అవకాశాలను పెంచడం వంటి లక్ష్యాలు ఈ పెట్టుబడికి కారణమని అమెజాన్ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగస్వామి కావడం, దేశీయ వినియోగదారులకు, వ్యాపారాలకు అధునాతన సేవలను అందించడం తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని కంపెనీ స్పష్టం చేసింది.

కొత్త నిధులను కృత్రిమ మేధస్సు సామర్థ్యాలు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, లోతైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ల్లోకి మళ్లించడం జరుగుతుందని అమెజాన్ పేర్కొంది. ఇది పరిధి వృద్ధి మార్కెటే గాకుండా భారతదేశంలో ప్రధాన ఆపరేటింగ్ పెరుగుతుండడంతో తన పాత్రను బలోపేతం చేస్తుటుందని అమెజాన్ తెలిపింది.