జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్నాధపురం పంచాయతీ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకలలో సర్పంచ్ కుంజా వినోద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జగన్నాధపురం మెయిన్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో అధికారం లేకుండా చేశారని అన్నారు.
జయంతి వేడుకలలో ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ మాట్లాడుతూ... చదువు అంటే ఏమిటో తెలియని రోజుల్లో అంబేద్కర్ అనేక ఉన్నత చదువులు చదివి మేధావిగా మారి రాజ్యాంగాన్ని రచించారని ఆయన గొప్ప దార్శనీయ వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జలగం మాధవి వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయం బోడప్ప, మిడియం నారాయణ, రామాచారి, కూరం రామకృష్ణ, గుంటూరు సాయి, ఈర్ల రామ్మోహన్ గ్రామ పెద్దలు, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






