calender_icon.png 14 October, 2025 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకుంటున్నారు

14-10-2025 09:15:00 AM

గద్దె నిర్మించుకుంటే కూలగొట్టిండ్రు

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన గోవర్ధనగిరి దళితులు

హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం(Akkannapet Mandal) గోవర్ధనగిరి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar statue) ఏర్పాటు చేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆ గ్రామానికి చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ వారు హుస్నాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. కొన్నేండ్ల కిందటే గ్రామ పంచాయతీ నుంచి అధికారిక అనుమతి తీసుకొని, గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో తమ వైతాళికుడైన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు గద్దెను నిర్మించుకున్నామని దళితులు కమిషన్ చైర్మన్‌కు వివరించారు. అయితే కొద్దిరోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, "ఊరిలో అంబేద్కర్ విగ్రహం ఎందుకు?" అంటూ నిర్మించిన గద్దెను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కులదూషణలు, పోలీసుల నిర్లక్ష్యం

విగ్రహాన్ని పెట్టకుండా అడ్డుకోవడమే కాకుండా, తమను ఉద్దేశపూర్వకంగా కులం పేరుతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అమానుష చర్యలు, కులవివక్షపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని, తమ సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని దళితులు ఆరోపించారు.

తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశం

దళితుల గోడు విన్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తక్షణమే ఈ సమస్యపై స్పందించారు. గోవర్ధనగిరి దళితుల సమస్యను పరిష్కరించాలని, విగ్రహ ఏర్పాటుకు అడ్డుపడిన వారిపై, కుల దూషణలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న హుస్నాబాద్ ఏసీపీ సదానందాన్ని ఆదేశించారు. అనంతరం దళితులు ఏసీపీ కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదు వివరాలను, ఎదుర్కొంటున్న సమస్యను ఏసీపీకి వివరించారు. కమిషన్ చైర్మన్ ఆదేశాల మేరకు పోలీసులు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తామని, అదే నిర్లక్ష్యం చేస్తే ఆందోళనకు సిద్ధమవుతామని దళితులు అన్నారు.