14-10-2025 10:00:46 AM
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు
జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు
విజయక్రాంతి, పాపన్నపేట: మండల పరిధిలోని యూసుఫ్ పేట(Yusuf Peta) శివారులోని పౌల్ట్రీ ఫారం సమీప ప్రాంతంలో బొమ్మా బొరుసు (జూదం) ఆడుతున్న పలువురిని సోమవారం అర్థరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు ప్రకటనలు పేర్కొన్నారు. యూసుఫ్ పేట శివారులోని పౌల్ట్రీ ఫారం సమీపంలో పలువురు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు రైడ్ చేయగా జూదం ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకొని వారి నుండి రూ.14,049 నగదు, 9 ఫోన్లు స్వాధీనం చేసుకుని పాపన్నపేట ఠాణాకు తరలించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పేకాట, బెట్టింగ్ వంటి కార్యకలాపాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. యువత కూడా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చెడు మార్గాలను ఎంచుకుంటున్నారని, కష్టపడనిదే ఏది ఊరికే రాదని పేర్కొన్నారు. ప్రజలు సైతం ఇలాంటి కార్యకలాపాలపై సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఆయన సూచించారు.