calender_icon.png 14 October, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌

14-10-2025 12:50:49 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): కరీంనగర్‌ జిల్లాలోని(Karimnagar) కొత్తపల్లి మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సెల్‌ ఫోన్‌లో చిత్రీకరించి, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలంలోని(Kothapalli Mandal) ఓ గ్రామానికి చెందిన బాలికతో ఇద్దరు యువకులు కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు. ఆమెకు మత్తుమందులు కూడా అలవాటు చేసినట్టు తెలుస్తున్నది. వారం రోజుల క్రితం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడి సమయంలో వీడియో చిత్రీకరించారు.

మూడు రోజుల క్రితం ఈ వీడియోలను స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు. ఈ వీడియోలు వైరల్‌ కావడంతో బాలిక తల్లిదండ్రుల దృష్టికి వెళ్లింది. లైంగిక దాడికి పాల్పడిన విశ్వతేజ్‌, సన్నీపై చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ విజయ్‌కుమార్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐ బిల్లా కోటేశ్వర్‌ దర్యాప్తు జరిపి ఇద్దరు యువకులపై పోక్సో కేసు(POCSO case) నమోదు చేశారు. సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువకులు బాలికలను లోబర్చుకుని వారికి కూడా మత్తు మందు అలవాటు చేయిస్తున్నట్టు తెలుస్తున్నది. యువత మత్తుకు బానిసలు కావద్దని ఇటీవల ఇదే గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే ఈ ఘటన వెలుగు చూడటం సంచలనంగా మారింది. గ్రామానికి మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మత్తు పదార్థాలను అరికట్టాలని కోరుతున్నారు.