6 March, 2026 | 12:17 PM

అమెరికా ట్యాంకర్ పేల్చివేత

06-03-2026 02:45 AM

ఇజ్రాయెల్‌పై యుద్ధాన్ని ఉధృతం చేసిన ఇరాన్

  1. గల్ఫ్‌లోని యూఎస్ ట్యాంకర్‌పై మేమే క్షిపణి దాడి చేశాం
  2. ప్రకటించిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్
  3. అజర్‌బైజాన్‌పై విరుచుకుపడ్డ డ్రోన్లు
  4. కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్‌పై, ఒమన్ పోర్ట్‌పై దాడి
  5. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి మరొకరి ఆచూకీ గల్లంతు

బహ్రెయిన్, ఫిబ్రవరి 5 : పశ్చిమాసియాలో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. హిందూ మహాసము ద్రంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా పై అమెరికా దాడి చేసి, ముంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్ దీనికి ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్‌లోని అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. పర్షియన్ గల్ఫ్‌లోని యూఎస్ ట్యాంకర్‌పై క్షిపణితో దాడి చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. నౌక నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నట్లు వెల్లడించింది.

ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. తమ యుద్ధనౌకపై దాడికి ప్రతిస్పందనగానే దాడి జరిగిందని పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోగా అటు అమెరికా కూడా స్పందించలేదు. భారత్‌లోని విశాఖపట్నం నుంచి ఇరాన్‌కు తిరిగి వెళ్తున్న ఐరిస్ దేనా-75పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 87 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమందిని శ్రీలంక దళాలు రక్షించాయి. మరికొంతమంది గల్లంతయ్యారు. అమెరికా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ హెచ్చరించారు. ఈ క్రమంలో యూఎస్ ట్యాంకర్‌పై దాడి జరగడం గమనార్హం.

శోకసంద్రంలో ఆశిష్ కుటుంబం

బీహార్‌లోని బెట్టియా నివాసి అయిన కెప్టెన్ ఆశిష్ కుమార్ ముగ్గురు సోదరులలో పెద్దవాడు. అతని తండ్రి అశోక్ కుమార్ న్యాయవాది. అతని తల్లి సునీతాదేవి గృహిణి. ఆశిష్ భార్య అన్షుకుమారి. ఆశిష్ మృతి విషయం తెలిసి వీరంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అతని ఐదేళ్ల కుమారుడు దక్ష్ తన తండ్రి కోసం విలపిస్తున్నాడు. ‘మా అన్న మరణించినట్లు మాకు వార్తలు, సోషల్ మీడియా ద్వారా తెలిసిందని ఆశిష్ సోదరుడు శుభమ్ తెలిపాడు. దాడికి గురైన ఓడలో మా అన్న ఉన్నాడో లేదో కూడా మాకు కచ్చితంగా తెలియదన్నాడు. 

యుద్ధానికి ముందే విధుల్లో చేరిన సోలంకి

ముంబైలోని కాందివాలికి చెందిన సోలంకి కుటుంబంలో కొన్ని నెలల్లోనే రెండో సభ్యుడిని కోల్పోయింది. దీంతో కుటుంబీకులు రోదిస్తున్నారు. అతను గత సంవత్సరం చివరిలో తన తల్లి అంత్యక్రియల కోసం ఇంటికి వచ్చాడు. యుద్ధానికి కొంతకాలం ముందే తిరిగి విధుల్లో చేరాడు. అతని కుటుంబంలో ఇప్పుడు తండ్రి, అక్క మాత్రమే బతికి ఉన్నారు. 

కువైట్‌లో చమురు ట్యాంక్‌పై దాడి

కువైట్ జలాల్లో ఓ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. దాంతో ఇంధనం సముద్రంలోకి ఒలికింది. గురువారం బ్రిటన్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఓ ప్రకటన చేసింది. కువైట్‌లోని ముబారక్ అల్ కబీర్ పోర్ట్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. 

శ్రీలంక దిశగా ఇరాన్ మరో యుద్ధనౌక

 అమెరికా దాడుల వేళ, ఇరాన్‌కు చెందిన మరో యుద్ధనౌక శ్రీలంక వైపు వెళ్తున్నట్లు సమాచారం. ఇటీవల ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేవా యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి ముంచేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఇరాన్ మరో యుద్ధనౌక శ్రీలంక వైపు వస్తోందని శ్రీలంక మంత్రి నలిందా జయతిస్సా పేర్కొన్నారు. ఈ నౌకపై కూడా అమెరికా దాడులు చేసే అవకాశం ఉండడంతో అందులో ఉన్న వారిని కాపాడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

అయితే ఈ నౌకలో దాదాపు 100 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ నౌక అత్యవసర పోర్ట్‌కాల్ కోసం ప్రభుత్వ అనుమతి కోరిందని క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు శ్రీలంక ఎంపీ నమల్ రాజపక్సా తెలిపారు. 

ఒమన్ పోర్ట్‌పై డ్రోన్లవర్షం

అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒమన్ గల్ఫ్‌లోని హోర్ముజ్ జలసంధిలో ‘స్కైలైట్’ ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. వీరు బీహార్‌కు చెందిన కెప్టెన్ ఆశిష్ కుమార్, ముంబైకి చెందిన దీక్షిత్ సోలంకిగా గుర్తించారు. ఒకే నౌకలో పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన సిబ్బంది దలీప్ సింగ్ తప్పిపోయినట్లు సమాచారం.

ఫిబ్రవరి 22న వచ్చిన పలావు జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్, దేశంలోని దుక్మ్ ఓడరేవుపై ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. ఈ మేరకు ‘రిపబ్లిక్ ఆఫ్ (పలావ్) జెండాను ఎగురవేస్తున్న ఆయిల్ ట్యాంకర్ ముసాండం గవర్నరేట్‌లోని ఖసాబ్ పోర్టుకు ఉత్తరాన 5 నాటికల్ మైళ్ల దూరంలో లక్ష్యంగా ఉందని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ గురువారం ప్రకటించింది. ట్యాంకర్‌లో 20 మంది వ్యక్తులు ఉన్నట్లు, వీరిలో 15 మంది భారతీయులు, ఐదుగురు ఇరానియన్‌లు ఉన్నట్లు సమాచారం. వివరాల ప్రకారం, ఇద్దరు వ్యక్తుల కాలిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆశిష్ కుమార్ మృతదేహాన్ని కెప్టెన్ క్యాబిన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆశిష్ కుమార్ జనవరి 20న మర్చంట్ నేవీలో చేరాడు. అతని మొదటి నియామకం దుబాయ్లో జరిగింది. ఫిబ్రవరి 22న, అతను ఐఎంఓ నంబర్ 9330020తో ఒమన్‌కు వెళ్లే స్కైలైట్ షిప్‌లో ఎక్కాడు. కెప్టెన్‌గా పనిచేస్తున్నాడని అతని సోదరుడు ఆకాష్ పేర్కొన్నాడు. ముంబై నివాసి అయిన దీక్షిత్ సోలంకి, తన కుటుంబంతో ముంబైలో చాలా నెలలు గడిపిన తర్వాత తిరిగి విధుల్లో చేరాడు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లోని గౌర్‌లోని గ్రామానికి చెందిన దలీప్ సింగ్ జనవరి 22న తన విధులను ప్రారంభించి, ట్యాంకర్లో సిబ్బంది సభ్యుడిగా పనిచేస్తున్నాడు.

అయితే రాజస్థాన్‌లోని దలీప్ సింగ్ ఇంట్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మార్చి 1 ఉదయం ఒమన్‌లోని ఓడరేవు వద్ద ఒక క్షిపణి అతని ఓడను ఢీకొట్టి పూర్తిగా ధ్వంసం చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. ఆ సమయంలో సింగ్ కెప్టెన్ ఆశిష్‌కుమార్‌తో కలిసి పనిచేస్తూ ఓడ వెనుక భాగంలో ఉన్నట్లు సమాచారం. అప్పటి నుంచి అతను కనిపించడం లేదని కంపెనీ అతని కుటుంబ సభ్యులకు తెలియజేసింది.. కానీ అతని మరణాన్ని నిర్ధారించలేదు.

అజర్‌బైజాన్‌పై డ్రోన్ల దాడి

ఇరాన్ డ్రోన్లు తమ దేశంపై దాడి చేశాయని అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రి జేహున్ బైరామోవ్ పేర్కొన్నారు. విమానాశ్రయం, స్కూల్‌పై అవి దాడి చేశాయని.. ఈ ఘటనల్లో ఇద్దరు పౌరు లు గాయపడ్డట్లు చెప్పారు. ఈ దాడులను  తమ దేశం ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈ దాడితో ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని తెలిపారు.