జెనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ పరిశోధన కేంద్రం
- మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒప్పందం
- స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి: మంత్రి
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి) : గ్లోబల్ దిగ్గజ బయోటెక్నాలజి సంస్థ యామ్జెన్’ (ఏఎంజీఈన్) జెనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం నాడు సచివాలయంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. అంతకు ముందు శ్రీధర్ బాబుతో భేటీ అయిన యామ్జెన్ ఇండియా ప్రతినిధులు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు.
సమావేశానంతరం యామ్జెన్ ఇండియా ఎండీ నవీన్ గుళ్లపల్లి, తెలంగాణా ప్రభుత్వ పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్యలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. జెనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశోధన కేంద్రంలో స్థానిక ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా వెల్లడించారు. యామ్జెన్ ఇటీవల 3 వేల మంది ఉద్యోగులతో అతి పెద్ద జీసీసీని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.
ఔషధ రంగ దిగ్గజ కంపెనీలు తెలంగాణా పట్ల అపార విశ్వాసం కనబర్చడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌవరమని ఆయన అన్నారు. లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రాష్ట్రం ఒక ముఖ్యమైన వేదికగా మారడం పట్ల శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేసారు. ఉద్యోగ అవకాశాల్లో ఇక్కడి యువతకు ప్రాధాన్యతనిచ్చి నియామకాలు జరపాలని యామ్జెన్ యాజమాన్యానికి ఆయన సూచించారు.
నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, జీనోమ్ వ్యాలీ వంటి అభివృద్ధి చెందిన ఎకోసిస్టమ్ కారణంగా తెలంగాణ ప్రపంచ లైఫ్ సైన్సెస్ సంస్థలకు కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందన్నారు.
దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న యామ్జెన్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల ఆరోగ్యం, ఇన్ఫ్లమేషన్, శ్వాసకోశ వ్యాధులు, అరుదైన వ్యాధులు తదితర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు వినూత్న చికిత్సలను అభివృద్ధి చేస్తోంది. కార్యక్రమంలో పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, తెలంగాణా లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేశ్ సింగ్, యామ్జెన్ ఇండియా ఎండీ నవీన్ గుళ్లపల్లి, ఇడి శ్రీను కొసరాజు, అనుమిత తదితరులు పాల్గొన్నారు.






