12 August, 2026 | 2:04 AM

కౌలు రైతులకు తక్షణ గుర్తింపు ఇవ్వాలి

12-08-2026 12:37 AM

జిల్లా సమావేశంలో డిమాండ్ చేసిన సాధన కమిటీ 

సంగారెడ్డి, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కౌలు రైతుల సమావేశం మంగళవారం శాంతినగర్ లోని టిపిటిఎఫ్ భవన్ హాల్ లో జరిగింది. కౌలు రైతులు, సాధన కమిటీ నాయకులు, రైతు సంఘాలు,  ప్రజా సంఘాల నాయకులతో సమావేశం విజయవంతంగా జరిగింది.

ఈ సమావేశంలో 8 మండలాల నుండి కౌలు రైతులు పాల్గొన్నారు. సమావేశానికి కమిటీ సభ్యులు రాగులపల్లి లక్ష్మి అధ్యక్షత వహించారు. జిల్లాలోని హత్నూర, మొగడంపల్లి, జహీరాబాద్, జరాసంఘం, న్యాలకల్, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాల నుండి కౌలు రైతులు వచ్చి తమ కష్టాలను వివరించారు. కౌలు రైతులకు గుర్తింపు సాధించుకునేందుకు గట్టి పొరాటం చేయడానికి సిద్ధం అని, హైదరాబాద్ స్థాయిలో కౌలు రైతుల గర్జనలో పెద్ద ఎత్తున పాల్గొంటామని ప్రకటించారు.

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ సభ్యులు తాము కౌలు వ్యవసాయంలో ప్రభుత్వ మద్దతు లేక, బ్యాంకు లోన్లు లేక అప్పుల ఊబిలో కూరుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కలుగుతుందని, ఇటువంటి ఆత్మహత్యలు జరగకుండా కౌలు రైతులను ప్రభుత్వం అన్ని పథకాలు అందించాలని కోరారు. ఇటీవల కౌలు రైతుల పరిస్థితి పై సాధన కమిటీ రాష్ట్ర వ్యాప్త సర్వే నిర్వహించింది.  22 జిల్లాలు, 47 మండలాలు, 58 గ్రామాలలో 1816 మంది కౌలు రైతులను ప్రత్యక్షంగా కలిసి చేసిన ఈ సర్వేలో వెల్లడి అయిన ముఖ్యాంశాలను కొండల్ రెడ్డి వివరించారు.

కౌలు రైతుల సర్వే నివేదిక తయారు చేసి ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సదస్సులు నిర్వహించి రాష్ట్రస్థాయి అధికారులు ప్రజా సంఘాలు వ్యవసాయ అనుబంధ రంగాల వారికి సమర్పించడం జరిగిందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ సంగీతను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి సాధన కమిటీ తరఫున రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు బి.కొండల్ రెడ్డి, కన్నెగంటి రవి, విస్సా కిరణ్ కుమార్, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు పి. శంకర్, టిపిజెఎసి జిల్లా కన్వీనర్ వై. అశోక్ కుమార్, రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు రంగా గౌడ్, మంజీర రైతు సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ పాల్గొని కౌలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. సంగారెడ్డి సాధన కమిటీ తరఫున ఆర్.లక్ష్మి, బి.చుక్కమ్మ, ఎం.విక్రమ్, మానస పాల్గొన్నారు.