రాజకీయ నాయకుల్లో.. పునర్విభజన కాక!
ఎమ్మెల్యేలు, పోటీచేసేవారిలో గందరగోళం!
- మహిళా రిజర్వేషన్లతోనూ మారనున్న నియోజకవర్గాల రూపురేఖలు
- వచ్చే మూడేండ్లపాటు చేసే ఖర్చులపై అయోమయం
- అనుచరులను మేనేజ్ చేయడం ఎలా అంటూ తలలు పట్టుకుంటున్న నేతలు
హైదరాబాద్, మార్చి 2౫ (విజయక్రాంతి) : ఒకవైపు ఉత్సాహం.. మరోవైపు అయోమయం. వెరసి గందరగోళం. ఏయే ప్రాంతాలకు పరిమితమైతే భవిష్యత్తులో బాగుంటుంది.. ఎంతమేర ఖర్చు పెట్టాలి.. ఇప్పుడు పెట్టే ఖర్చు వృథా అవుతుందా.. లాంటి అనేక ప్రశ్నలు, అనుమానాలు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతోపాటు.. ఎమ్మెల్యేగా పోటీచేయనున్న ఔత్సాహికుల్లోనూ వెల్లువెత్తుతున్నాయి.
2029 ఎన్నికల నాటికి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను, లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పోటీచేయాలని ఉత్సాహపడుతున్న నేతల్లో తీవ్ర గందరగోళం మొదలయ్యింది. రాష్ట్రంలో 2023లో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవానికి 2028లో ఎన్నికలు జరగాలి. అయితే ఈ మధ్యకాలంలో ఢిల్లీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2028లో ఎన్నికలు జరగ వని.. 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని కొద్దిరోజులగా పలుమార్లు చెబుతున్నారు.
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని, దీనితోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులను ఆమోదించి అమల్లోకి తీసుకురావాలనే ఆలోచనను కేంద్రం బయటపెట్టడంతో.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే తలంపుతో ఉన్న ఔత్సాహికుల్లో మాత్రం గందరగోళం నెలకొంది.
యాభై శాతం నియోజకవర్గాలు పెరిగితే.. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు కాస్తా.. 179కి చేరుకుంటాయి. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో ఏ ప్రాంతాలు ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.. ప్రస్తుతం ఉన్న ప్రాంతాలు వేరే నియోజకవర్గంలోకి ఏవేవి పోతాయి.. అనేది ఇప్పుడు అందరిలోనూ తొలుస్తున్న ప్రశ్న. ప్రస్తుతం తెలంగా ణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలతోపాటు..
ఇప్పటికే వివిధ పార్టీల తరఫున (ప్రధానంగా బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎంతోపాటు ఇతర పార్టీలు) గతంలో పోటీచేసినవారు.. నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏ నియోజకవర్గంలో తన అనుచరవర్గం ఉంటుందోననే అంచనాల్లో పడ్డారు. 119 నుంచి 179 వరకు నియోజకవర్గాలు పెరుగుతాయంటే.. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కనీసం 33 శాతం ప్రాంతాలు కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలోకిగానీ.. ఇతర నియోజకవర్గాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
అనుచరులు..
ప్రాంతం ఎంతలా మారుతుందోననే బెంగ ఇప్పటికే అన్ని పార్టీల నాయకుల్లో మొదలయ్యింది. అయితే అంతకంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం.. 2029 వరకు పెట్టాల్సిన ఖర్చులే ఇటు ఎమ్మెల్యేలతోపాటు.. పోటీ చేయాలనే ఔత్సాహికుల్లోనూ ఎక్కువ భయాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తోంది. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారు.. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునేవారు తమ నియోజకవర్గాల పరిధిలో జరిగే పెండ్లిళ్లకు వెళ్ళి గిఫ్టులు ఇవ్వడం, శుభకార్యానికి హాజరై అందిరినీ పలకరించడం ద్వారా తమ పట్టు జారిపోకుండా చూసుకుంటారు.
అలాగే నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా.. ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం చేస్తుంటారు. దీనివల్ల తమకు అనుచరవర్గాన్ని పెంచుకోవడం, సానుభూతి, అందిరితో కలుపుగోలుగా ఉండటం వల్ల, కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం వల్ల ఎన్నికల్లో తమకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రాంతం నియోజకవర్గంలో ఉంటుందో.. ఊడుతుందో తెలియకపోవడం వల్ల.. ఇప్పుడు పెండ్లిళ్లు, మరణాలు, కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలా వద్దా.. అనే మీమాంసలో పడిపోయారు.
మహిళా రిజర్వేషన్‌తో..
నియోజకవర్గాల పునర్విభజనకు తెర లేవడంతో.. ఇప్పటికే గందరగోళానికి గురవుతున్న నేతలు.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉంటాయనికూడా కేంద్రం స్పష్టం చేయడంతో.. పెనంమీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా నేతలు ఫీలవుతున్నారు. మూడేండ్ల పాటు.. చచ్చీచెడీ... ఖర్చులు పెట్టి.. అనుచరులను సిద్ధంచేసుకుని ఎన్నికలకు తయారైతే.. చివరికి మహిళలకు ఆ నియోజకవర్గం రిజర్వ్ అయితే ఎలా అనే అనుమానాలు ఎమ్మెల్యేలను, పోటీచేయాలని అనుకుంటున్న ఔత్సాహికులను కూడా తొలచివేస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న 119 స్థానాలు.. నియోజకవర్గాల పునర్విభజనతో 179కి చేరుకుంటాయి. ఇందులో మహిళలకు 33 శాతం అంటే.. కనీసం 60 స్థానాలు రిజర్వ్ అవుతాయి. అంటూ మూడో వంతు స్థానాలకు ఈ గండం ఉంటుంది. అయితే ఈ మూడో వంతు స్థానాలు ఏమిటనేది.. ఎలాంటి మార్గదర్శకాల ప్రకారం వీటిని ఏర్పాటు చేస్తారనే స్పష్టత లేకపోవడంతో.. ఎమ్మెల్యే ఔత్సాహికుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా తయారయ్యింది.
అంతా సిద్ధం చేసి.. చివరికి మహిళకు రిజర్వ్ అయితే తమ పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు. మరోపక్క వివిధ పార్టీల రాజకీయ నాయకులు మహిళా రిజర్వేషన్లలో తలదూర్చకమానరు. తమ ఇంటి నుంచే భార్య, కుమార్తెలు పోటాపోటీగా బరిలోకి దిగుతామంటే చిక్కులు ఎదురైనట్టే. మహిళా రిజర్వేషన్ల వల్ల రాజకీయ నాయకుల ఇంట్లో చాలాచోట్ల ముసలం పుట్టక మానదు అని విశ్లేషకులు అంటున్నారు.
మొత్తానికి కేంద్రం రెండు తీవ్ర ప్రభావం చూపే అంశాలను పూర్తిచేస్తామనే స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో.. అటు నియోజకవర్గాల పునర్విభజన, ఇటు మహిళా రిజర్వేషన్లు అటు తిరిగి. ఇటు తిరిగి.. తమ అవకాశాలపై, తాము ఆశలు పెట్టుకున్న, అనుచరగణాన్ని సిద్ధం చేసుకున్న నియోజకవర్గంపై ఎంతగా ప్రభావం చూపుతుందో అనే గందరగోళం మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే పోటీదారుల్లో ఇప్పటికే మొదలయ్యింది.
తర్జనభర్జనలు, గందరగోళం మధ్యన ఖర్చు పెట్టాలా.. వద్దా.. ఏ ప్రాంతం ఉంటుంది.. ఏ ప్రాంతం పోతుంది.. అసలు మనకే ఉంటుందా.. మహిళకు రిజర్వ్ అవుతుందా అనే మీమాంసలో ఔత్సాహికులందరూ కొట్టుమిట్టాడు తున్నారు. ఇందులో నుంచి బయటపడాలంటే.. మరో మూడేండ్ల పాటు ఎదురు చూడాల్సిందేనేమో..!
ఖర్చు తడిసి మోపెడు..
రాబోయే ఎన్నికలు 2029లో ఉంటాయనేది స్పష్టం. అయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా ఎన్నికలకు కొద్దికాలం ముందు ముగుస్తుంది. అంటే అప్పటివరకు.. సుమారు 3 ఏండ్లపాటు అనుచరులను, ద్వితీయశ్రేణి నాయకులను ఎలా మెయింటైన్ చేయాలా అని తల పట్టుకుంటున్నారు. నాయకుడంటే ప్రతిరోజూ ఎంతో కొంత ఖర్చు ఉంటనే ఉంటుంది. ఇక శుభకార్యాలు, అశుభకార్యాలు సరేసరి.
ఇదీకాకుండా.. వినాయ క చవితి లాంటి పండుగలకు భారీగానే చందాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మూడేండ్ల పాటు ఇలా భారీగా ఖర్చు చేసినా.. చివరికి నియోజకవర్గం ప్రాంతం మారితే తమ పరిస్థితి ఏమటని నాయకులు తలలు బాదుకుంటున్నారు. ఇప్పుడు అనవసరంగా ఖర్చు పెట్టడం కంటే.. ఇదంతా పోగుచేసి.. నియోజకవర్గం ఖరారు అయిన తరువాత ఒకేసారి ఖర్చు చేస్తే సరి అంటూ ఔత్సాహిక నేత ఒకరు చెప్పడం గమనార్హం.




