10-01-2026 01:53:00 AM
సంగారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమిని కొందరు దుండగులు సినీ ఫక్కీలో అర్ధరాత్రి కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీగార్డులను కిడ్నాప్ చేశారు. మరో కుటుంబంపై దాడి చేసి.. చం పుతామని బెదిరించారు. 9 ఎకరాల భూమి చుట్టూ కంచె వేసేందుకు యత్నిస్తున్న దుండగులను పోలీసులు అడ్డుకుని, పలువు రిని అదుపులోకి తీసుకున్నారు. రూ.300 కోట్ల విలువైన భూ మిని కాపాడారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లారుజాము వరకు జరిగిన ఈ ఘటన హంగామా సృష్టించింది. కొల్లూరు సీఐ గణేషపాటిల్ కథనం ప్రకారం... జూబ్లీహిల్స్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ భగవంత్‌రెడ్డి సతీమణి జి.మాధవికి చెందిన 5.12 ఎకరాల భూమి కొల్లూరులో ఉంది. అలాగే సినీ నిర్మాత చద లవాడ శ్రీనివాస్‌కు చెందిన 4 ఎకరాల భూమిని గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు దుండగులు కబ్జా చేసేందుకు యత్నించారు.
సుమారు వంద మందికి పైగా బోర్డులు, రేలింగ్ పైపులతో డీసీఎం, ఆటోలలో అక్కడికి చేరుకున్నారు. వీ రంతా 9 ఎకరాల భూమిలో కంచె ఏర్పాటు చేయడానికి గోతులు తవ్వుతూ రేలింగ్ పనులు చేపడుతుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు, బీహార్‌కు చెందిన కుటుంబం అడ్డుకోవడంతో వారిపై దాడి చేసి గాయపర్చారు. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి చంపుతామ ని బెదిరించి, నార్సింగి వద్ద వదిలేసి వెళ్లారు. అక్కడ ఉన్న మరో కుటుంబాన్ని చంపుతామని బెదిరించి కంచె వేసేందుకు యత్నించారు.
సెక్యూరిటీ గార్డుల ద్వారా సమాచారం అందుకున్న యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటీన సీఐ గణేష్ పాటిల్, కొల్లూరు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, పోలీసులు సిబ్బంది తెల్లవారుజామున 3 గంటలకు ఆ ప్రాంతాని రావడంతో దుండగుల్లో కొందరు పారిపోయారు. 20 మంది పురుషులను, 12 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సుమారు రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించింది ఎవరనే కోణంలో విచారణ చేపడుతున్నామని సీఐ తెలిపారు.