10-01-2026 02:01:41 PM
హైదరాబాద్: సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. వంతెనల నిర్మాణం జరుగుతున్న చోట యంత్రాలు కూడా తొలగించామని వెల్లడించారు. నేషనల్ హైవే డైరెక్టర్ తో ఇప్పటికే మాట్లాడినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగితే టోల్ వసూలు లేకుండా పంపించాలని చెప్పామని పేర్కొన్నారు. వచ్చే ఏడాడి హైదరాబాద్- విజయవాడ హైవే(Hyderabad-Vijayawada Highway) 6 లైన్లుగా విస్తరిస్తామని చెప్పారు.
ఎన్ హెచ్-65 విస్తరణ కోసం రూ. 10,400 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని వివరించారు. రూడ్లపై వాహనాలు ఆగిపోతే వెంటనే తొలగించేందుకు హైవేపై క్రేన్లు సిద్ధంగా ఉంచామని సూచించారు. సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నుండి ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లడం ప్రారంభించడంతో వాహనాల రద్దీ పెరిగి శనివారం ఉదయం నుండి జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-65పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ నుండి పంతంగి టోల్ ప్లాజాకు వాహనాలు చేరుకోవడానికి రెండున్నర గంటల సమయం పడుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. ఫాస్ట్‌ట్యాగ్ స్కానర్ల ద్వారా టోల్ రుసుము వసూలు చేస్తున్నారు.
పంతంగి టోల్ ప్లాజాలోని మొత్తం 16 టోల్ గేట్లలో, హైదరాబాద్ వైపు నుండి విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 10 గేట్లను కేటాయించారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనుల కారణంగా ఎన్‌హెచ్-65పై పెద్దకపర్తి వద్ద ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. పెద్దకపర్తి వద్ద వాహనాలను ఇరుకైన సర్వీస్ రోడ్లలోకి మళ్లించడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవేపై పెద్దకపర్తి నుండి వెలిమినేడు వరకు ఏర్పడిన ఈ ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఎన్‌హెచ్-65పై ఉన్న కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగాయి.