7 July, 2026 | 2:21 AM

కార్గిల్ షేర్ షా బాత్రా

07-07-2026 12:00 AM

పవిత్రమైన భారత భూమిలో పుట్టిన వీరులకు ప్రాణభయం ఉండదు. దేశమాత కోసం ప్రాణాలు అర్పించేందుకు వారు ఎప్పుడూ ముందువరుసలో ఉంటారు. దేశ ప్రజలు అపాయంలో ఉన్నారంటే చాలు, బుల్లెట్ల వర్షానికి తమ గుండెలను అడ్డుపెట్టి మరీ వారిని రక్షించే త్యాగనిరతులు మన భారత సైనికులు. కార్గిల్ యుద్ధానికి కెప్టెన్ విక్రమ్ బాత్రా కూడా ఇలాగే బయలుదేరారు. ‘కార్గిల్‌లోని శత్రుమూకలను తరిమికొట్టి జాతీయ పతాకాన్ని ఎగురవేసి వస్తాను.

అది సాధ్యం కాకపోతే, అదే త్రివర్ణ పతాకాన్ని నా దేహానికి చుట్టుకుని తిరిగి వస్తాను’ అని తన తల్లితో ఆయన చెప్పారు. విధి నిర్ణయం వేరుగా ఉన్నా, తాను ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకున్నాడు. యుద్ధరంగంలో వీరమరణం పొందిన ఆయన భౌతికకాయం త్రివర్ణ పతాకంతో స్వగ్రామానికి చేరుకుంది.

కెప్టెన్ విక్రమ్ బాత్రా హిమాచల్ ప్రదేవ్‌లోని పాలంపూర్‌లో జన్మించారు. చిన్నప్పటి నుంచే విక్రమ్‌కు భారత సైన్యంలో చేరాలనే బలమైన సంకల్పం ఉండేది. 1996లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరి శిక్షణ పూర్తిచేసిన అనంతరం లెఫ్టినెంట్‌గా 13వ జమ్మూ అండ్ కశ్మీర్ రైఫిల్స్‌లో నియమితులయ్యారు.

కార్గిల్ యుద్ధ సమయంలో కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందారు. కార్గిల్ యుద్ధ సమయంలో ద్రాస్ సబ్‌సెక్టార్‌లోని టోలోలింగ్ పర్వత శ్రేణిలో ఉన్న పాయింట్ 5140ను స్వాధీనం చేసుకోవడం భారత సైన్యానికి అత్యంత క్లిష్టమైన సవాలుగా మారింది. శిఖరంపై పటిష్టమైన స్థావరాలు ఏర్పాటు చేసుకున్న పాకిస్థాన్ సైనికులు పైకి వస్తున్న భారత జవాన్ల ప్రతి కదలికను గమనిస్తూ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు.

ఈ శిఖరాన్ని స్వాధీనం చేసుకునేందుకు మొదట 1 నాగా బెటాలియన్, అనంతరం 18 గ్రెనేడియర్స్, తరువాత రాజ్‌పుతానా రైఫిల్స్ అనేక రోజుల పాటు తీవ్రంగా పోరాడినా విజయం సాధించలేకపోయాయి.

చివరకు 1999 జూన్ 19న 13వ జమ్మూ అండ్ కశ్మీర్ రైఫిల్స్‌కు చెందిన డెల్టా కంపెనీకి ఈ బాధ్యత అప్పగించారు. ఈ దాడిలో విక్రమ్ బాత్రా తన కోడ్ నేమ్‌గా ‘షేర్ షా’ను ఉపయోగించారు. కార్గిల్ యుద్ధంలో పాయింట్ 5140 కోసం జరిగిన పోరాటం అత్యంత క్లిష్టమైన యుద్ధాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది.

బాత్రా, మరో కెప్టెన్ జాంవాల్ దళాలకు లక్ష్యాన్ని చేధించడానికి ఎనిమిది గంటల సమయమే ఉంది. తెల్లవారితే శత్రువులకు భారత దళాల కదలికలు స్పష్టంగా కనిపించే ప్రమాదం ఉంది. సుమారు 80 డిగ్రీల నిటారుగా ఉన్న పర్వతాన్ని అధిరోహిస్తూ, రాత్రి చీకటిని ఆసరాగా చేసుకుని రెండు వైపుల నుంచి దాడి ప్రారంభించారు.

శత్రువుల కాల్పులను లెక్కచేయకుండా ముందుకు దూసుకెళ్లిన విక్రమ్ బాత్రా గ్రెనేడ్‌తో ఒక బంకర్‌ను పేల్చివేశారు. బాత్రా, జాంవాల్ నాయకత్వంలోని దళాలు ఏడు బంకర్లను స్వాధీనం చేసుకున్నాయి. అనేక మంది పాక్ సైనికులు భయంతో పారిపోతూ లోయల్లో పడిపోయారు.

తెల్లవారడానికి ఇంకా గంట సమయం ఉండగానే పాయింట్ 5140పై విజయాన్ని సాధించిన విక్రమ్ బాత్రా తన ఉన్నతాధికారులకు విజయ సంకేతంగా ‘యే దిల్ మాంగే మోర్’ అనే కోడ్ సందేశాన్ని పంపించారు. పాయిం ట్ 5140 విజయానంతరం భారత సైన్యం ముష్కో లోయలోని పాయింట్ 4875పై దృష్టి సారించింది.

జ్వరంతోనే యుద్ధరంగంలోకి దూసుకెళ్లిన విక్రమ్ బాత్రా అపూర్వమైన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ తెల్లవారేలోపు శత్రువుల మూడు ఎల్‌ఎంజీ బంకర్లను ధ్వంసం చేశారు. నాలుగో బంకర్ వద్ద శత్రువు జరిపిన కాల్పు ల్లో ఒక బుల్లెట్ ఆయన ఛాతిని ఛేదించింది. అయినప్పటికీ చివరి క్షణం వరకు కాల్పులు కొనసాగిస్తూ వీరమరణం పొం దారు.

ఆయన అసమాన వీరత్వానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం మరణానంతరం దేశ అత్యున్నత సైనిక పురస్కారమైన పరమ వీర చక్ర ప్రదానం చేసింది. నేడు పాయింట్ 4875ను ‘బాత్రా టాప్’గా పిలుస్తున్నారు. కార్గిల్ కదనరంగంలో పాల్గొన్న ప్రతి భారత సైనికుడి జీవితగాథ ఒక సమరగాథే. ఆ రణక్షేత్రంలో వారు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతి గురించి వర్ణిస్తే ప్రతి సంఘటన ఒక మహాసమర కావ్యంగా నిలుస్తుంది.

 వ్యాసకర్త సెల్: 9908621080