24 June, 2026 | 3:09 AM

కార్మికుల కోసం ఎక్కడికైనా వస్తా

24-06-2026 02:07 AM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఎన్‌ఆర్బీ బేరింగ్ కంపెనీ యాజమాన్యంతో వేజ్ అగ్రిమెంట్‌పై చర్చ

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): ఉప్పల్‌లోని ఎన్‌ఆర్బీ బేరింగ్ కంపెనీలో వేజ్ అగ్రిమెంట్ అంశంపై టీఆర్‌కేవీ యూనియన్ ప్రతినిధులు కంపెనీ యాజమాన్యంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీఆర్‌కేవీ యూనియన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జనరల్ సెక్రటరీ వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వేజ్ అగ్రిమెంట్‌కు సంబంధించిన ముఖ్య అంశాలపై మల్లన్న యాజమాన్యంతో చర్చించారు.

కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రతిపాదనలను కంపెనీ యాజమాన్యం సానుకూలంగా స్వీకరించింది. ఈ విషయంపై మరింత సమగ్రంగా మరోసారి చర్చించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు. కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే యూనియన్ టీఆర్‌కేవీ కాదన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు శివ కుమార్, సుధాకర్, వెంకటేష్, కాంతరావు, గోలి వెంకటేష్, జగన్ మోహన్, శ్రీనివాస్, నరేష్ పాల్గొన్నారు.