24 June, 2026 | 3:12 AM

బాసర ఆలయ ప్రాంగణంలో చోరీ

24-06-2026 02:11 AM

నిర్మల్, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భారీ చోరీ జరిగింది. సోమవారం రాత్రి భద్రకాళి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం, హుండీలోని డబ్బులు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.

ఈ ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి రావడంతో భక్తులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.  గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్కులు వేసుకొని ఆలయం వెనుక వైపు నుంచి గుడిలోకి ప్రవేశించి ఆలయం తలుపులు బద్దలు కొట్టడంతో పాటు సీసీ కెమెరాలకు గుడ్డలు చుట్టి భద్రకాళి అమ్మవారిపై ఉన్న వెండి కిరీటం, ఇతర నగలను ఎత్తుకెళ్లారు. ఆన్‌లైన్‌లో ఉన్న హుండీ గల పెట్టను ఎత్తుకొని వెళ్లి సమీపంలో ఉన్న గుట్టల్లో ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు అపహరించారు.

ప్రధాన మార్గాల్లో సీసీ కెమెరాలు ఉన్నట్టు గుర్తించిన దొంగలు ఆలయం కుడివైపు ఉన్న ఎత్తున కొండ మధ్యలో నుంచి వచ్చి భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ చోరీకి పాల్పడ్డట్టు సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఉదయం నిత్య పూజలు చేసేందుకు వచ్చిన అర్చకులు అమ్మవారి కిరీటం కనిపించకపోవడం వస్తువులు చిందరవందరగా ఉండడం. గేటు ధ్వంసం కావడం హుండీ బాక్స్ కనిపించకపోవడంతో ఆలయ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బైంసా సబ్ కలెక్టర్ సాంకేత్ కుమార్ డీఆర్‌ఓ రమేష్ రాథోడ్ ఆలయ అధికారులు ఆలయం వద్దకు చేరుకొని పరిశీలించారు. డాగ్స్ స్కాడ్. ఫింగర్ ప్రింట్, తెప్పించి ఆధారాలను సేకరించారు. గుట్ట ప్రాంతాల్లో వెతకగా దంసమైన ఉండి కనిపించింది. ఇది మహారాష్ట్ర చెందిన దొంగల ముఠా పని భావిస్తున్న పోలీసులు వారికోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

బాసరలో భద్రత వైఫల్యం కారణంగానే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. అయితే బాసర ఆలయ హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించిన రోజే ఈ చోరీ జరగడం కొత్త చర్చకు దారితీస్తోంది. పోలీసులు మాత్రం అన్ని కోణాలు విచారిస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో దత్తాత్రేయ మందిరంలో ఇదే తరహా దొంగతనం జరగగా మరోసారి అటువంటి చోరీ జరగడం పోలీసులకు సవాల్ గా మారింది.

బాసర ఆలయంలో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రతిరోజూ రాత్రి వేళ విధులు నిర్వహిస్తారు. వీరంతా అమ్మవారి ప్రధాన ఆలయంతోపాటు భద్రకాళి దత్తాత్రేయ మందిరాల భద్రత పర్యవేక్షిస్తారు. దీనికి తోడు బాసర పోలీస్ స్టేషన్ సిబ్బంది అర్ధరాత్రి వరకు పెట్రోలింగ్ చేస్తారు.