30 May, 2026 | 2:47 AM

నీటి సమస్యను తీర్చలేని అసమర్థ్ధ ప్రభుత్వం

30-05-2026 12:00 AM

తలసాని శ్రీనివాస్ యాదవ్ 

సికింద్రాబాద్, మే29 (విజయక్రాంతి):  ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడలేదని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు నీటికోసం ప్రజలు అవస్థలు పడుతు న్నారని పేర్కొన్నారు. నల్లాలకు నీరు రావడం లేదని ప్రజలు ప్రశ్నిస్తే నీటి కొరత ఉందని అధికారులు సమాధానం చెబుతున్నారని ధ్వజమెత్తారు. నల్లాలకు లేని నీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ఒక్కో నీటి ట్యాంకర్ ను 4 వేల నుండి 5 వేల రూపాయల వరకు అమ్ముతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఎమ్మెల్యే తలసాని విమర్శించారు.

అరకొర నీటి సరఫరా చేసినా అవి కూడా మురికిమయం గా ఉంటున్నాయని తెలిపారు. ప్రజలకు కనీస అవసరమైన నీటి సమస్యను తీర్చలేని అసమర్ధ ప్రభుత్వం ఉండటం బాధాకరం అన్నారు. జూన్ 5 వ తేదీలోగా గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో త్రాగునీటి సమస్యను పరిష్కరించకుంటే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని తలసాని హెచ్చరించారు.