30 May, 2026 | 2:08 AM

ఎంజీయూలో ఔట్‌సోర్సింగ్ అక్రమ నియామకాలపై విచారణ చేపట్టాలి

30-05-2026 12:55 AM

విద్యార్థి సంఘ నాయకులు

నల్లగొండ టౌన్, మే 29: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని పలువురు విద్యార్థి సంఘ నాయకులు కోరారు. శుక్రవారం యూనివర్సిటీ బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని కోరుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు.

అనంతరం పలువురు విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. రోస్టర్ రిజర్వేషన్ విధానం పాటించకుండా, పత్రిక ప్రకటనలు సరైన విధంగా ఇవ్వకుండా, అర్హులైన నిరుద్యోగులకు అవకాశం లేకుండా నియామకాలు చేపట్టినట్లు చేపట్టారన్నారు.

ఇప్పటికే ఈ అంశంపై యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్కు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందించకపోవడంతో ఉన్నత విద్యా మండలి చైర్మన్కు పిర్యాదు బేసినట్లు తెలిపారు. గతంలో నవీన్ మిట్టల్ వైస్ ఛాన్సలర్గా ఉన్న సమయంలో కూడా 33 మంది డైలీవేజ్ ఉద్యోగులను రోస్టర్ రిజర్వేషన్, పత్రిక ప్రకటనలు లేకుండా అక్రమంగా నియమించారని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన నియామకాలలో కూడా నిరుద్యోగుల వద్ద నుండి లక్షల రూపాయలు వసూలు చేసి 100కు పైగా అక్రమ నియామకాలు చేపట్టినట్లు ఆరోపించారు.

అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్లో ఆ ఏజెన్సీకి యూనివర్సి టీఇతర ప్రభుత్వ సంస్థల్లో పనులు ఇవ్వకుం డా బ్లాక్లిస్ట్ చేయాలని కోరారు. ఈ అంశంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా యూనివర్సిటీ అధికారులతో చర్చిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు పోలగోని శివ, రాజేష్, యశ్వంత్, రామ్, జితేందర్, సంజీవ పాల్గొన్నారు.