అక్రమాలపై విచారణ జరిపించాలి
కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ సవాల్
బడంగ్‌పేట్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి) బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ నాయకుడు కేఎల్‌ఆర్ (కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి)కి చిత్తశుద్ధి ఉంటే, వెంటనే జ్యుడీషియల్ విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బడం గ్పేట్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు కాంగ్రెస్, బీజేపీ తీరును ఎండగట్టారు.
బడంగ్పేట్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే అవినీతి జరిగిందని, అందుకే పది మంది అధికారులు సస్పెండ్ అయ్యారని ఆరోపించారు. బదిలీపై వెళ్లిన కమిషనర్ను తిరిగి ఎవరు తెప్పించారో సమాధానం చెప్పాలని నిలదీశారు. కేవలం అధికారులపై వేటు వేసి చేతులు దులుపుకోకుండా, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి పక్కా విచారణ జరిపించాలని సూచించారు.
అవినీతిపై విచారణకు తాము సిద్ధమని, దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ నేతలు విచారణకు పట్టుబట్టాలని బీఆర్‌ఎస్ నేతలు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సూర్ణగంటి అర్జున్, పవన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




