కంథీ స్థానంలో ఆసక్తికర పోరు!
అక్కడ సుమేందు కుటుంబం వర్సెస్ తృణముల్‌గా మారిన సీన్
సుమేందు సోదరుడిని ఓడించాలని దీదీ ప్లాన్
పశ్చిమ బెంగాల్, మే 24 : దేశంలో సార్వత్రిక ఎన్నికల పోరు కొనసాగుతోంది. మొత్తం 7 విడతల్లో ఇప్పటికే 5 విడతల్లో పోలింగ్ పూర్తయ్యింది. నేడు ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఆరో విడతలో పలు కీలక స్థానాలు ఉండటంతో దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తృణముల్, బీజేపీ ముఖాముఖి పోరుకు వేదికైన పశ్చిమబెంగాల్‌లోని కొన్ని కీలక స్థానాల్లో ఎన్నికలు ఆరో విడతలోనే జరగనున్నాయి.
ఆరో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో పశ్చిమ బెంగాల్‌లోని కాంథీ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ లోక్‌సభ స్థానం సువేందు కుటుంబం, తృణముల్ మద్య జరగనున్న బిగ్‌ఫైట్‌కు వేదికైంది. ఈ స్థానంలో బీజేపీ కీలక నేత సువేందు అధికారి సోదరుడు సౌమేందు పోటీ చేస్తున్నందున, ఆయనపై ప్రతీకారం తీర్చుకునేందుకు తృణముల్ ఉవ్విళ్లూరుతోంది. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా పరిధిలోని ఈ స్థానం సువేందుకు కుటుంబానికి కంచుకోట. ఇక్కడ ఆయన తండ్రి శిశిర్ అధికారి తృణముల్ టికెట్‌పై 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు విజయం సాధించారు.
ఈసారి సువేందు తమ్ముడు సౌమేందు అధికారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పత్నాపూర్ ఎమ్మెల్యే ఉత్తమ్ బారిక్ తృణముల్ నుంచి, యువ న్యాయవాది ఊర్వశి భట్టాచార్య సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. తామ్లుక్‌తో పాటు కాంథీలోనూ నెగ్గి సువేందుపై ప్రతీకారం తీర్చుకోవాలని తృణముల్ భావిస్తోంది. కాగా, ఈసారి సువేందు అధికారి తామ్లుక్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతపై నందిగ్రాం స్థానంలో సువేందు పోటీచేసి 1,956 ఓట్లతో గెలిచారు. దీంతో, దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది. అందుకే, సువేందుపై ప్రతీకారం తీర్చుకునేందుకు దీదీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తామ్లుక్, కాంథీ స్థానాల్లో పోటీ చేస్తున్న సువేందు, ఆయన సోదరుడు సౌమేందులను ఓడించేందుకు సర్వ శక్తులు వడ్డుతోంది. దీంతో, ఇప్పుడు ఈ కీలక స్థానాలపై అందరి దృష్టి నెలకొంది.






