5 August, 2026 | 1:30 AM

డీఎస్‌హెచ్‌కు అధికారిని నియమించాలి

05-08-2026 12:24 AM
  1. మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
  2. హరీష్‌రావుకు తెలంగాణ వైద్య విద్య ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ వినతి

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీఎస్‌హెచ్)కు పూర్తిస్థాయి అధికారిని వెంటనే నియమించాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన గైనకాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, పీడియాట్రిక్ తదితర ప్రత్యేక వైద్య సేవలను అందించే తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిస్థితి కమిషనర్ లేక గాలిలో దీపంలా మారడం శోచనీయమన్నారు. గత రెండు నెలలుగా పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతోటీవీవీపీ పరిధిలోని ఎంసీహెచ్, జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీ మొత్తంగా 184 ఆసుపత్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం తెలంగాణ వైద్య విద్య ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు హరీష్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆసుపత్రుల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్యుల హాజరు, ల్యాబ్ పరీక్షలు, మందుల లభ్యత తదితర అంశాలను పర్యవేక్షించే ఉన్నతాధికారి లేకుండా పోయారని, దీంతో ఒకవైపు వైద్యులు, వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కారం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

వైద్య సిబ్బంది వేతనాలు, సర్వీస్ సమస్యలు సహా ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చి ప్రభుత్వం లో విలీనం చేయాలని గతం బీఆర్‌ఎస్ ప్రభు త్వం నిర్ణయించిందని గుర్తు చేశారు.  మూడేళ్లు గడుస్తున్నా.. సర్వీసు నిబంధనలు రూపొందించక పోవడం దురదృష్టకరమన్నారు.   ఉద్యోగులు రోడ్లెక్కి నిరసన లు తెలియచేస్తున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.  వెంటనే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు సంబంధించి వెంటనే కమిటీ వేసి సర్వీస్ నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించాలని, తక్షణమే పూర్తిస్థాయి అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు.