11 August, 2026 | 5:00 PM

బీడీ కార్మికుల పెన్షన్‌కు ‘చేయూత’ ఆప్షన్ చేర్చాలి

11-08-2026 04:08 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియలో బీడీ కార్మికులకు సంబంధించిన ‘చేయూత’ ఆప్షన్ లేకపోవడాన్ని నిరసిస్తూ మల్లాపూర్ మండలానికి చెందిన బీడీ కార్మికులు మంగళవారం మండల కేంద్రంలోని భరతమాత కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న బీడీ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే పెన్షన్ అప్లికేషన్ ఫామ్‌లో బీడీ కార్మికులకు సంబంధించిన ‘చేయూత’ ఆప్షన్‌ను చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న మల్లాపూర్ ఎస్సై అనిల్ కుమార్, ఎంపీడీవో అల్వాల శ్రీకాంత్ ధర్నా స్థలానికి చేరుకుని బీడీ కార్మికులతో మాట్లాడారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, అర్హులైన బీడీ కార్మికులకు పెన్షన్ అందే విధంగా నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు.అధికారుల హామీతో బీడీ కార్మికులు ధర్నాను విరమించారు. అనంతరం తమ సమస్యలను వివరిస్తూ ఎంపీడీవో అల్వాల శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు.