11 August, 2026 | 5:00 PM

అటవీ హక్కుల లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి అండ

11-08-2026 04:16 PM

అటవీ హక్కుల చట్టం ప్రయోజనాలు ప్రతి అర్హుడికి అందేలా చర్యలు

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఉట్నూర్,(విజయక్రాంతి): అటవీ హక్కుల పత్రాలు పొందిన గిరిజనులు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల సమస్యల పరిష్కారంతో పాటు వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో దొంగచింత, బీర్సాయిపేట్ గ్రామ పంచాయతీల పరిధిలో "షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం–2006 అమలుపై పైలట్ సామాజిక తనిఖీ.." ప్రజా వేదిక" కార్యక్రమం నిర్వహించారు.

సీఏజీ, క్రిస్ప్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు గిరిజన రైతులు తమ సమస్యలు, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అటవీ హక్కుల పత్రాలు పొందిన రైతులకు పంట రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ రాయితీలు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు వాస్తవంగా అందుతున్నాయా లేదా అనే అంశాలను ఈ సామాజిక తనిఖీ ద్వారా సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  2006లో తీసుకువచ్చిన  అడవి హక్కుల చట్టంపై దేశంలోనే ప్రథమంగా  అదిలాబాద్ జిల్లాలో  సోషల్ ఎడిట్ (సామూహిక తనకి) నిర్వహించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పట్టాదారులు మరణించిన సందర్భాల్లో వారి వారసుల పేర్లకు అటవీ హక్కుల పత్రాలు బదిలీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు.

అర్హులైన వారసులు ఐటీడీఏ లేదా సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టా ఉన్నా లేకపోయినా అటవీ భూముల్లో సాగు చేస్తున్న అర్హులైన రైతులకు ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా మార్కెట్‌లో తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేలా అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. కోర్ ఏరియాలో ఇప్పటికే తవ్విన బోరు బావులను వినియోగంలోకి తీసుకురావడానికి సోలార్ ప్యానెల్‌ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు కల్పించే విషయంలో అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరంద్ మాట్లాడుతూ, అడవుల్లో తరతరాలుగా నివసిస్తున్న గిరిజనులు, ఉద్దేశంతోనే అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006 అమలులోకి వచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా సాగు హక్కులు, నివాస హక్కులు, సామూహిక అటవీ హక్కులు, అటవీ వనరుల వినియోగ హక్కులు వంటి నాలుగు ప్రధాన హక్కులు లబ్ధిదారులకు కల్పించబడుతున్నాయని వివరించారు.

చట్టం అమలు ద్వారా నిర్దేశించిన లక్ష్యాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు నెరవేరుతున్నాయో స్వతంత్రంగా అంచనా వేయడానికే క్రిస్ప్ సోషల్ ఆడిట్ బృందం ఈ సామాజిక తనిఖీ నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ గంగాధర్, ఉట్నూర్ ఆర్డీఓ మోహన్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఎల్‌డీఎం ఉత్పల్ కుమార్, ఏపీవోలు వసంత్ రావు, భాస్కర్, కిసాన్ గిరిజన మిత్ర కోఆర్డినేటర్ హర్ష, అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు, క్రిస్ప్, కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.