11 August, 2026 | 5:14 PM

ఆగస్టు 31 వరకు కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ

11-08-2026 04:04 PM

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

కలెక్టర్ రాజర్షి షా వెల్లడి

ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త పింఛన్ల కోసం ఈ రోజు నుంచి ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. మంగళవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేయూత పథకం కింద నూతన దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నవీకరణ ప్రక్రియను ఐటిడిఏ పీఓ మంద మకరందుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్ల వద్ద దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైనవారు దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఫొటో, బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ జతచేయాల్సి ఉంటుందన్నారు. వితంతు పింఛన్ల కోసం గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలని, చేనేత, గీత కార్మికుల దరఖాస్తులను ఎక్సైజ్, హ్యాండ్లూమ్ శాఖల సమన్వయంతో పరిశీలిస్తామన్నారు. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి అర్హులకు పింఛన్ మంజూరు ప్రొసీడింగ్స్ అందజేస్తామని వివరించారు. దరఖాస్తు చేసుకోవడానికి సుమారు మూడు వారాల సమయం ఉన్నందున ప్రజలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని కోరారు. గిరిజన ప్రాంతాల్లో పెసా మోబిలైజర్లు, కోఆర్డినేటర్ల ద్వారా ఆదివాసీలు, ఇతరులకు దరఖాస్తు ప్రక్రియలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.