ఒడిదుడుకులుంటాయ్!
ఇన్వెస్టర్లకు విశ్లేషకులు హెచ్చరిక
న్యూఢిల్లీ, జూన్ 5: భవిష్యత్‌లో స్టాక్ మార్కెట్ కదలికలు కొత్త ప్రభుత్వపు ఆర్థిక విధానాలు, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటాయని, అంతర్జాతీయ పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేష కులు చెప్పారు. బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానున్నందున, పటిష్ట నిర్ణయాల్ని తీసుకొని, వాటిని అమలు చేసే అంశంపై మార్కెట్లు ఆందోళనకు లోనవుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈక్విటీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున సెన్సెక్స్ 8 శాతం పతనమైన విషయం తెలిసిందే.
ఎన్‌డీఏ ప్రభుత్వం గత రెండు టెర్మ్‌ల్లోనూ ఆర్థిక సంస్కరణలపై దృష్టినిలిపిందని, అది మూడో టెర్మ్‌లో లోపిస్తుందని స్టాక్‌బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీశ్ చౌదరి చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం విధాన నిర్ణయాలకు భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సి ఉంటుం దని, కొన్ని కేబినెట్ బెర్త్‌లను పంచుకోవాల్సి ఉంటుందని, దీంతో ప్రభుత్వ పని తీరులో అనిశ్చితి ఏర్పడుతుందని అబాన్స్ హోల్డింగ్స్ అనలిటిక్స్ సీనియర్ మేనేజర్ యశోవర్థన్ ఖెమ్కా చెప్పారు. అలాగే కొత్త ప్రభుత్వం సంక్షేమ విధానాలవైపు మారవచ్చని, ఇది మార్కెట్ పతనానికి దారితీ స్తుందని హెచ్చరించారు. కొత్త ప్రభుత్వపు ఆర్థిక విధానాలు, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అంశాలు భవిష్యత్ మార్కెట్ దిశను నిర్దేశిస్తాయని హెడోనోవా చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సుమన్ బెనర్జీ వివరించారు. జీడీపీ, మార్కెట్ విలువ, డెమోగ్రాఫిక్ డివిడెండ్ తదితర అంశాల్లో భారత్ టాప్‌లో ఉండటం సానుకూలాంశమని మిరే అసెట్ క్యాపిటల్ మార్కెట్స్ డైరెక్టర్ మనీశ్ జైన్ చెప్పారు.






