19-10-2025 06:45:54 PM
అధ్యక్షుడిగా గుడిమెట్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఇరుగు వెంకటేశ్వర్లు
కోదాడ: జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడిమెట్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఇరుగు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జర్నలిస్టుల సంఘం యూనియన్ నాయకులు, జిల్లా మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ ఆదేశాలతో, టియుడబ్ల్యూజే హెచ్ 143 యూనియన్ కోదాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొలిచలం నరేష్ సూచనలతో మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా రామకృష్ణ, వెంకటేశ్వర్లకు మద్దతు తెలిపారు. వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన రామకృష్ణకు, రెండవసారి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వెంకటేశ్వర్లకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారిరువురూ మాట్లాడుతూ... సమాజ సేవలో నాలుగో స్తంభంగా పిలువబడే జర్నలిస్టుల సేవలను గుర్తించాలని నిత్యం వార్తా సేకరణతో ప్రజలకు అవగాహన కల్పించి వారిని మేల్కొల్పే విధంగా జర్నలిస్టులు వ్యవహరిస్తున్న తీరు అమోఘం అని అన్నారు. అలాంటి జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా పాటుపడాలని కోరారు. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ తమ సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కొలిచలం శ్రీను, బూరా సత్యనారాయణ, మట్టపల్లి ఉపేందర్, గద్దె రాంబాబు, బెల్లంకొండ సతీష్, బానోత్ రవి, శ్రీరామ్ రవి, కొలిచలం హరిబాబు పాల్గొన్నారు.