ఐటమ్ సాంగ్స్ అసలే రాయను!
హీరో రవితేజ సోదరుడైన రఘు తనయుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. దర్శకుడు మంచాల నాగరాజు ఈ చిత్రాన్ని విలేజ్ యాక్షన్- డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్‌రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి గీత రచయిత మిట్టపల్లి సురేందర్ చెప్పిన ముచ్చట్లు ఇవి..
‘ధైర్యం’ సినిమాకు తొలిసారి పాట రాశా. ‘రాజన్న’లో ‘కాలిగజ్జె ఘల్లుమంటే..’, ‘జార్జ్ రెడ్డి’లో ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్‌ఫిల్డూ..’, ‘లవ్ స్టోరీ’లో ‘నీ చిత్రం చూసి..’ పాటలూ నేను రాసినవే. ‘రాజు వెడ్స్ రాంబాయి’ పాటలు నాకు మంచి పేరు తెచ్చాయి. ఆ సినిమాలోని పాట నాకు మర్చిపోలేని అనుభూతినిచ్చింది.
ఈ మధ్యకాలంలో ‘పెద్ది’ సినిమాలో రెండు పాటలు రాశాను. ఢిల్లీ ఎపిసోడ్‌లో వచ్చే ‘అలసిపోవద్దురా పెద్ది..’, అలాగే పెద్ది ట్రైన్‌లో తిరిగి వస్తున్నప్పుడు వచ్చే ‘అనగనగా..’ పాట, జగపతిబాబు ఎపిసోడ్‌లో వచ్చే ‘ఆగిన శ్వాసలో ఆశయం ఉంది..’ పాటలు రాశాను. అవన్నీ కథకు ఆయువుపట్టులాంటి పాటలు. థియేటర్‌లో ప్రేక్షకులను ఎంతగానో కదిలించాయి.
‘మారెమ్మ’లో రాసిన ‘మారి’ పాట గురించి చెప్పాలి.. ‘మారి’ హీరో ఆడుకునే దూడ పేరు. ఈ పాట రాసే అవకాశం రావడం నా అదృష్టం. ఒక దూడ చుట్టూ అనుబంధాన్ని, భావోద్వేగాన్ని వ్యక్తపర్చడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ పాట రాస్తున్నప్పుడు నా బాల్యం గుర్తుకు వచ్చింది. ‘బొబ్బిలి రాజా’ సినిమాలోని బసవన్న పాటలా ఒక ల్యాండ్‌మార్క్ సాంగ్ రాయాలనే సంకల్పంతో ఈ గీతం రాశాను.
దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఆయనతోపాటు నేనూ ఏడ్చేశాను. కథ నన్ను అంతలా కదిలించింది. మొదట ఒక పాట కోసం పిలిచి, అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. మొత్తం ఆరు పాటలుంటే, అందులో నాలుగు పాటలు నేను రాశాను. -నేను కథ చదువుతున్నప్పుడు నేను ఎలాంటి ఎమోషన్ ఫీల్ అయ్యానో, అదే భావోద్వేగాలను దర్శకుడు అద్భుతంగా స్క్రీన్‌పైకి తెచ్చారు. కర్ణి పాత్రలో మాధవ్ ఒదిగిపోయాడు. -మయూర్ తొలిసారి నిర్మాత అయినా ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడు చాలా టాలెంటెడ్.. సాహిత్యం మీద మంచి పట్టుంది. ప్రతి పాటా దగ్గరుండి రాయించారు.
సినీ పరిశ్రమలో వేటూరి, చంద్రబోస్ నాకు స్ఫూర్తి. నేను ఏ పాట రాసినా నా కుటుంబం మొత్తం కలిసి వినేలా ఉండాలి. అందుకే జీవితంలో ఐటమ్ సాంగ్స్ జోలికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నా. సంగీతం చేయాలనే ఆలోచన లేదు. రెండు పడవల ప్రయాణం చేయను. ఇప్పుడు సినీ గీతాలకే నా పూర్తి సమయాన్ని కేటాయించాను. అందుకే ప్రైవేటు సాంగ్స్ రాసే ఛాన్సులు వస్తున్నప్పటికీ సున్నితంగా తిరస్కరిస్తున్నా. ప్రస్తుతం ‘ఇడుపు కాయితం’, ‘జిల్లేడు చెట్టు’, ‘దేత్తడి’, ‘డేవిడ్ రెడ్డి’ ఇలా దాదాపు పది సినిమాలకు పాటలు రాస్తున్నా.






