22 August, 2026 | 2:51 AM

అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు లక్ష్మీస్వరూపులు

22-08-2026 12:20 AM

 మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ సీహెచ్ ప్రీతిరెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): వరలక్ష్మీ వ్రతం అనగానే సాధారణంగా బంధువులు, స్నేహితులను ఆహ్వానించుకోవడం పరిపాటి. అయితే సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలే ‘నిజమైన లక్ష్మీస్వరూపులు’ అని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి చాటిచెప్పారు. హైదరాబాద్ కొంపల్లిలోని తన నివాసంలో డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి ఆధ్వర్యంలో ‘వరలక్ష్మీ పూజ’ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి విచ్చేసిన 500 మందికి పైగా అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని ప్రసాదించే దేవత మాత్రమే కాదు..

ఇంటింటికీ తిరుగుతూ గర్భిణులు, పసిపిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమించే ప్రతి మహిళా నిజమైన లక్ష్మీదేవి స్వరూపమే అని అన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పడుతున్న కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, వారందరినీ ఆత్మీయంగా ఆహ్వానించి, ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు పసుపు-కుంకుమ, తాంబూలాలు అందించడం తనకు ఎంతో తృప్తినిచ్చిందని తెలిపారు.