21-01-2026 01:48:14 AM
హైదరాబాద్, జనవరి 20, 2026: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలను చట్టవిరుద్ధమైన రీతిలో వధించటాన్ని తెలంగాణ జంతు సంక్షేమ సంస్థల కార్యాచరణ కూటమి ఖండించింది, కోర్టు ఆదేశాలను తీవ్రంగా ఉల్లంఘించటంతో పాటుగా విస్తృత స్థాయి పరిపాలనా వైఫల్యం జరుగుతుందని ఆరోపించింది. విస్తృతమైన హత్యలు మరియు తీవ్ర క్రూరత్వ సంఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసిన నేపథ్యంలో తక్షణ ప్రభుత్వ జోక్యాన్ని కోరింది. క్షేత్ర స్థాయి నివేదికల ప్రకారం, ఈ కూటమి జనవరి 2026 మొదటి వారాల్లోనే సుమారు 500 వీధి కుక్కల హత్యకు గురయ్యాని చెబుతోంది. ఇటీవలి కాలంలో 10 కి పైగా తీవ్రమైన క్రూరత్వ కేసులను నమోదు చేసినట్టు తెలిపింది.
వాటిలో కుక్కలను రాడ్‌లతో కొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో విషప్రయోగం చేయడం మరియు వాటి అవయవాలను ముక్కలు చేయడం వంటివి ఉన్నాయి. కామారెడ్డి , హన్మకొండ జిల్లాల నుండి అత్యంత తీవ్రమైన సంఘటనలు జరిగాయని కూటమి వెల్లడించింది. ఈ హింస జంతువుల ప్రవర్తన వల్ల కలిగింది కాదని, మానవ నిర్లక్ష్యం మరియు దీర్ఘకాలిక పరిపాలనా వైఫల్యం వల్ల జరిగిందని ఈ కూటమి పేర్కొంది. హైదరాబాద్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) నిర్వహిస్తున్న "కుక్కల తొలగింపు కార్యక్రమాలు" జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 మరియు జంతు జనన నియంత్రణ (ఏబీసీ) నియమాలు, 2023లను ఉల్లంఘిస్తున్నాయని కూటమి గుర్తుచేసింది.
తగినంతగా పశువైద్య మౌలిక సదుపాయాలు లేకుండా కుక్కలను విచక్షణారహితంగా బంధిస్తున్నారనీ, ఏబీసీ కేంద్రాలకు తీసుకెళ్లబడిన జంతువులను స్టెరిలైజ్ చేయటం లేదని వివరించింది. చట్ట ప్రకారం వాటిని తప్పనిసరి గా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ అలా చేయటం లేదని గుర్తు చేసింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఈ చర్యలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నాయని జంతు సంక్షేమ సంస్థల కార్యాచరణ కూటమి పేర్కొంది. ఈ కేసులో కోర్టుకు హాజరైన న్యాయవాది శ్రీ రమ్య, ఇటువంటి చర్యలు కోర్టు ధిక్కారానికి సమానమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని చర్యలను తీసుకోవాల్సిందిగా కూటమి కోరింది.