22-12-2025 02:49:43 PM
చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామ నూతన సర్పంచ్‌గా అమరగాని ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్‌గా కొంగల అనూష రామలింగం, వార్డు సభ్యులు సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో సంతోష్ కుమార్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల అనంతరం నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ప్రమాణ స్వీకారం అనంతరం వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ అనూష రామలింగంను పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. గ్రామ పెద్దలు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం మొత్తం గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ వృథా చేయనని హామీ ఇచ్చారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్, కాలువలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ప్రజలతో సమన్వయంతో పారదర్శక పాలన అందించి అక్కలదేవిగూడెం గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే తనను ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులతో కలిసి గ్రామాభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరగాని అబ్బులు గౌడ్, నంద్యాల నరేష్ రెడ్డి, ఇతర నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.