calender_icon.png 1 January, 2026 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెంగనూరులో తెలుగు భక్తులకు అన్నప్రసాదం

01-01-2026 12:00:00 AM

నేటి నుంచి 15 వరకు 

శ్రీ ధర్మశాస్తా అన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

ఘట్ కేసర్,  డిసెంబర్ 31 (విజయక్రాంతి): అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్న శబరిమల యాత్రలో, తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు హైదరాబాద్కు చెందిన శ్రీ ధర్మశాస్తా అన్నదాన సేవా ట్రస్ట్ నడుం బిగించింది. కేరళలోని ప్రముఖ రైల్వే జంక్షన్ అయిన చెంగనూరు రైల్వే స్టేషన్ వెనుక, 2026 జనవరి 1వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు 15 రోజుల పాటు సుదగానీ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తున్నారు. 

మాతృభాషలో పలకరింపు.. మన ఊరి భోజనం

ప్రతి ఏటా మకరవిలక్కు సమయంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి లక్షలాది మంది భక్తులు కేరళకు చేరుకుంటారు. అయితే అక్కడ స్థానిక కేరళ భోజనం (మలయాళీ వంటకాలు) మన తెలుగు వారికి అలవాటు లేకపోవడం, రుచి భిన్నంగా ఉండటంతో స్వాములు భోజనం విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఇబ్బందులను గమనించిన సుదగానీ రాజు గురుస్వామి నేతృత్వంలోని ట్రస్ట్ సభ్యులు, తెలుగు స్వాముల కోసం ప్రత్యేకంగా మన పద్ధతిలో భోజన వసతి కల్పించాలని నిర్ణయించారు.

సేవయే మా భాగ్యం: రమేష్ గురుస్వామి

ఈసందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి గడ్డం రమేష్ గురుస్వామి మాట్లాడుతూ మండల కాలం ముగిసి మకర జ్యోతి దర్శనానికి వెళ్లే సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మారుమూల ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కడుపునిండా భోజనం పెట్టడమే మా లక్ష్యం. ఆ మణికంఠుడి దర్శనానికి వచ్చే స్వాములకు సేవ చేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఆ శబరిమల అయ్యప్ప స్వామి దయతో ప్రతి ఏటా ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.  ఈ కార్యక్రమాన్ని సుదగానీ రాజు గురుస్వామి, పెద్ది రమణారావు గురుస్వామి, గడ్డం రమేష్ గురుస్వామి, ట్రస్టు సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. రైలు మార్గంలో వచ్చే భక్తులకు స్టేషన్ దిగగానే అందుబాటులో ఉండేలా స్టేషన్ వెనుక భాగంలోనే ఈ అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

భక్తులకు విజ్ఞప్తి

శబరిమలకు వెళ్లే స్వాములు కానీ,  దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యే తెలుగు భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పెద్ది రమణారావు గురుస్వామి,  నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు లేదా, రూట్ మ్యాప్ కోసమైనా ఎలాంటి సందేహాలు ఉన్న 9052264599, 8121995587, 9390454647 ఈఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని నిర్వాహకులు కోరారు.