31-12-2025 11:58:56 PM
మొయినాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించి,విద్యాసంస్థలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కారం చూపించాలని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మొయినాబాద్ లో ఎస్‌ఎఫ్‌ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విప్లవ వీరుడు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి, ఎస్‌ఎఫ్‌ఐ జెండాను విద్యార్థి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బేగరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ 1970 సంవత్సరంలో కేరళ రాష్ట్రం త్రివేంద్రంలో స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతో ‘అధ్యయనం పోరాటం’ నినాదంతో ప్రారంభమైందని గుర్తు చేశారు. పడు నుంచి విద్య సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని వారు తెలిపారు.ప్రతి విద్యార్థికి నాణ్యమైన, శాస్త్రీయమైన, ఉచిత విద్య అందాలనే లక్ష్యంతో ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థులకు వ్యతిరేకంగా నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తూ, అశాస్త్రీయమైన మరియు చరిత్రను వక్రీకరించే విద్యను ప్రవేశపెడుతోందని తీవ్రంగా విమర్శించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా విద్యాశాఖకు మంత్రి నియమించ కపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్షణమే పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు ఎర్రవల్లి శ్రీనివాస్, మొయినాబాద్ మండల అధ్యక్షుడు రేశ్వంత్, కార్యదర్శి చరణ్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఎండి. ఇర్ఫాన్, చేవెళ్ల మండల అధ్యక్షుడు ఇర్ఫాన్, కార్యదర్శి మాల చందు, పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.