14 August, 2026 | 2:41 AM

బీడీ కార్మికులకు అన్యాయం చేస్తే మరో ఉద్యమం

14-08-2026 01:41 AM

రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ 

నిర్మల్, ఆగస్టు 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ప్రధాన ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం చేస్తే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ హెచ్చరించారు.

గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులకు ఆసరా దరఖాస్తులో అవకాశం కల్పించి జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కృష్ణ మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఏళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వయసు పైబడిన బీడీ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడం అన్యాయమని అన్నారు.

ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు కొత్తగా పింఛన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రజాపాలన అంటే బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ దూరం చేయడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు నెలకు రూ.4,016 ఆసరా పెన్షన్ అందేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట రాజన్న, జిల్లా అధ్యక్షుడు బక్కన్న, జిల్లా ఉపాధ్యక్షుడు రామలక్ష్మణ్, జిల్లా సహాయ కార్యదర్శి గంగన్న, జిల్లా కోశాధికారి గఫూర్, జిల్లా కమిటీ సభ్యులు కే. లక్ష్మీ, ఎస్. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.