14 August, 2026 | 2:41 AM

స్టీల్ బ్రిడ్జికి సంగం లక్ష్మీబాయ్ పేరు పెట్టాలి

14-08-2026 01:41 AM

సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ సలహాదారు వీహెచ్ లేఖ 

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు ఉన్న స్టీల్ బ్రిడ్జికి స్వాతంత్య్ర సమరయోధురాలు, మాజీ పార్లమెంటేరియన్ సంగం లక్ష్మిభాయ్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు కోరారు.ఈ మేరకు ఆయన గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా వీహెచ్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ స్టీల్ బ్రిడ్జికి మాజీ ఎంపీ సంగం లక్ష్మీబాయ్ పేరు పెట్టడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు.

1911 జులై 27న రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన లక్ష్మీబాయ్ 1952లో అల్వాల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అప్పటి సీఎం బూర్గుల రామకృష్ణారావు క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారని తెలిపారు. మెదక్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా విజయం సాధించి ఉమ్మడి ఏపీ నుంచి ఎంపీగా ఎన్నికైనా తొలి మహిళాగా చరిత్ర సృష్టించారని వీహెచ్ తెలిపారు.

సంగం లక్ష్మిబాయ్ స్వాతంత్రోద్యమంలో జైలు జీవితం గడిపారని, మహాత్మగాంధీ పులుపుతో ఉప్పు సత్యాగ్రహం, సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం గడిపారని తెలిపారు. హైదరాబాద్‌లో  ౨ఇందిరా సేవా సదనం’ స్థాపించి అనాధ బాలికలకు, నిరుపేద మహిళల అభ్యున్నతికి కృషి చేశారని, వేలాది మందికి ఆశ్రయం, ఉచిత విద్య, జీవనోపాధి కల్పించారని ఆయన తెలిపారు. శుక్రవారం నిర్వహించే పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయడానికిఎక్కువ సంఖ్యలో ప్రజలు రావాలని ఆయన కోరారు.