02-10-2025 12:47:42 AM
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణలోని రైతులకు కేసీఆర్ భరోసాను ఇచ్చారని, నాటి బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో రైతుల ఆత్మ హత్యలు గణనీయంగా తగ్గాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. 2015లో 1,209 నుంచి 2023లో 48కి రైతుల ఆత్మహత్యలు తగ్గాయని స్పష్టం చేశారు.
తెలంగాణలో 96 శాతం బలవన్మరణాలు కనుమరుగయ్యాయని, ఈ విషయాన్ని కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిస్థితి తారుమారు అయిందని, రెండేళ్ల లోనే 700 మందికిపైగా అన్నదాతల ఆత్మహత్యలు సంభవించాయని వివరించా రు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ అనుకూల విధానాల ఫలితంగా తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు.
రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ చూడాలనుకున్న కేసీఆర్ కల సాకారమైందని, ఇందుకోసం ఆయన పడిన కష్టం, చేసిన కృషి ఫలించిందని తెలిపారు. ఆయన ఆశయం నెరవేరిందని, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు దాదాపుగా కనుమరుగయ్యాయని వివరించారు. దేశంలోని రైతుల ఆత్మ హత్యల్లో తెలంగాణ వాటా 2014లో 10.9 శాతం కాగా, 2023 నాటికి 0.51 శాతంగా నమోదైనట్టు తెలిపారు. మళ్లీ కేసీఆర్ రావాలి, రైతులు చల్ల గా నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని నమ్మట్లేదు
రాష్ట్రంలో ఉన్నది సర్కారు కాదు, సర్కస్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ది అసమర్థ పరిపాలన అంటూ కేటీఆర్ ఎక్స్ ద్వారా తీవ్ర విమర్శ లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతులేని అరాచకత్వం, అపరిమితమైన అజ్ఞా నం రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదన్నారు.
నిధులు ఇవ్వడం లేదంటూ పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీడియాకెక్కుతారని తెలిపారు. వరదలు వస్తే నియోజకవర్గ ప్రజలకు సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంకుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉత్తరం రాశారని గుర్తు చేశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సరిగా పనిచేస్తలేదని, కాబట్టి పరిశ్రమనే తగులబెడతానని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరించి రౌడీయిజం చేస్తారని విమర్శించారు.