11-08-2025 01:46:45 AM
జలమయమైన లోతట్టు ప్రాంతాలు..
హైదరాబాద్ ,సిటీ బ్యూరో ఆగస్టు 10 (విజయక్రాంతి): రాజధాని హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురా సహా అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమై, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే నగరానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసినట్లు అధికారులు గుర్తుచేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో జీహెఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలను, డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే జీహెఎంసీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.