14-07-2025 01:28:15 AM
సంగారెడ్డి, జూలై 13 (విజయక్రాంతి)/ పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదాన్ని మరువక ముందే అదే పారిశ్రామికవాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పరిశ్రమలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్లాం టుకు అంటుకున్నట్లు కార్మికులు చెప్పారు.
మంటలు అంటుకున్న వెంటనే ఫైర్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో పాశమైలారం, పటాన్‌చెరు, సంగారెడ్డి నుంచి నాలుగు ఫైర్ ఇంజన్‌లు వచ్చాయి. అధికారులు, సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి నాగేశ్వర్‌రావు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి పరిశ్రమ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు.
నిద్రావస్థలోనే అధికారులు..?
పటాన్‌చెరు నియోజకవర్గంలోని పారిశ్రామికవాడల్లో వరుస ప్రమాదాలు జరుగుతు న్నా సేఫ్టీ అథారిటీ అధికారులు మాత్రం ఇంకా నిద్రావస్థ వీడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిగాచి ఘటనతో తేరుకున్న ప్రభుత్వం ప్రత్యేక కమిటీలు వేసి నిజని ర్ధారణ చేయించింది. మళ్లీ పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా కఠినచర్యలు తీసుకోవాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు పారిశ్రామికవాడలోని పరిశ్రమలను తనిఖీ చేసిన దాఖలాలు లేవు.
సిగాచి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అందరి దృష్టి పాశమైలారం పారిశ్రామికవాడలో పడింది. అయినప్పటికీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, కార్మికశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల సేఫ్టీ అథారిటీ అధికారులు సిగాచి ఘటన తర్వాత పరిశ్రమల్లో తనిఖీలు చేయలేదు.
పాశమైలారంలోని చాలా పరిశ్రమల్లో పాత యంత్రాలు, నైపు ణ్యం కలిగిన ఉద్యోగులు లేక పోవడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పారిశ్రామికవాడల్లోని పరిశ్రమలపై ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు, కార్మికులు కోరుతున్నారు.
ఉలిక్కిపడ్డ పారిశ్రామికవాడ..
ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంతో పాశమైలారం పారిశ్రామికవాడ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో జరిగిన ఘోరం ఇంకా మరువకముందే మరో పరిశ్రమలో ప్రమాదం జరిగిందని తెలి యగానే చుట్టు పక్కల పరిశ్రమలలోని కార్మికులు భయంతో బయ టకు పరుగులు తీశారు. ప్రమాదంతో ఎలాంటి ఆపద ముంచు కొస్తుందో అని కార్మికులు భయం తో వణికిపోయారు. ప్రమాద తీవ్రత తెలుసుకొని ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పివేసిన తర్వాతే కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు.