రాష్ట్రంలో మరో ఎన్నికకు షెడ్యూల్

26-04-2024 01:23:05 AM

l వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల  స్థానానికి ఉపఎన్నిక

l మే 2 నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ

l మే 10న నామినేషన్ల పరిశీలన 

l నామినేషన్ల ఉపసంహరణకు గడువు మే 13

l మే 27వ తేదీన పోలింగ్, జూన్ 5 నుంచి కౌంటింగ్

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): తెలంగాణలో మరో ఎన్నికకు షెడ్యూలు విడుదలైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఎలక్షన్ కమిషన్ గురువారం షెడ్యూలును విడుదల చేసింది. మే 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరిస్తారు. మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉపసంహరణకు మే 13 వరకు అవకాశం ఉంటుంది. మే 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 5వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. జనగాం ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ 9న రాజీనామా చేశారు.

2021లో ఈ ఎన్నికలు జరగగా.. ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉంది. అయితే పల్లా రాజీనామాతో ఇప్పుడు ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగుతోంది. నిబంధనల మేరకు సీటు ఖాళీ అయిన 6 నెలల్లో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఈసీ షెడ్యూలును విడుదల చేసింది. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ, సిద్ధిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలున్నాయి. ఇప్పటికే పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఈసీ తుది జాబితాను విడుదల చేసింది. 4,61,806 మంది పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకున్నారు. 

ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన...

ఈ స్థానంలో కాంగ్రెస్ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను బరిలో దింపింది. 2021 ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు. పల్లా, మల్లన్న, కోదండరామ్ పోటీ పడగా మల్లన్న రెండో స్థానం, కోదండరాం మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీతో దగ్గరి సంబంధాలు నెరుపుతూ వచ్చిన మల్లన్న.. తనకు ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం వస్తుందని భావించారు. కరీంనగర్ నుంచి పోటీ చేసే అభ్యర్థి అంటూ ప్రచారం కూడా నడిచింది. కానీ అక్కడ రాజేందర్‌రావును కాంగ్రెస్ బరిలో నిలిపింది.

మల్లన్నను వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్‌ఎస్ పార్టీకి ఇది సిట్టింగ్ స్థానం. ఇక పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి ఈసారి డబుల్ డిజిట్ సాధిస్తామని ధీమాగా ఉన్న బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో నిలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థి లభిస్తారా అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు తమ అభ్యర్థులుగా ఎవరిని బరిలో నిలుపుతారనేది ఆసక్తికరంగా మారింది.