ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు

26-04-2024 01:29:02 AM

n చిన్నారి సహా ఆరుగురు దుర్మరణం

n మరో ఇద్దరికి తీవ్రగాయాలు

n కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

n మృతులందరిదీ ఒకే కుటుంబం

నల్లగొండ, ఏప్రిల్ 25(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని దుర్గాపురం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న  ఓ చిన్నారి సహా ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతు ల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ పాప ఉన్నారు. ప్రమాద సమయంలో కారులో పది మంది ఉన్నట్టు సమాచారం. వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతున్నట్టు తెలుస్తుంది. బ్రేక్ డౌన్ అయిన లారీ రోడ్డు పక్కనే నిలపడంతో ఈ ప్రమా దం జరిగినట్టు సమాచారం. మూడు రోజు ల క్రితం కూడా ఇదే తరహాలో ఓ కారు రోడ్డుపై నిలిపిన లారీ కిందికి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతిచెందారు.

ఆ ఘటన మరువకముందే మరోసారి అలాంటి ప్రమాదమే జరగడం ఆందోళన రేపుతుంది. వేసవి కావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు రాత్రిపూట ప్రయాణం చేయడం, రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలను గమనించకపోవడంతో ఈ ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. మృతుల్లో ఐదుగురు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఎల్ గోవిందపురం గ్రామానికి చెందినవారు కాగా ఒకరు కోదాడ మండలం చిమ్మిర్యాల వాసి. వీరు హైదరాబాద్ నుంచి విజయవాడ గుణదలలో పాపకు చెవులు కుట్టించ డానికి కారులో బయలుదేరారు. మృతులను మాణిక్యమ్మ, చందర్రావు, కృష్ణంరాజు, స్వర్ణ, శ్రీకాంత్, లాస్యగా గుర్తించారు. ప్రమాద ఘటనపై ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. లారీ బ్రేక్ డౌన్ అవడం, అదే సమయంలో కారు అతి వేగంతో రావడం తో ప్రమాదం జరిగినట్టు గుర్తించామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఇటీవల నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించామని.. ప్రమా దాలు జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైవేపై పలుచోట్ల స్పీడ్ గన్స్, క్రిస్ క్రాస్ బోర్డులు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.