నాయకులకే లాభం జరిగింది
గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదు. ప్రత్యేక రాష్ట్ర ఫలితం కొందరికే దక్కింది. స్వరాష్ట్రంలోనే అనేక రంగాల్లో అన్యాయం జరిగింది. నాయకులకు మాత్రమే వ్యక్తిగత ప్రతిష్ట పెరిగేలా బతుకమ్మలాంటి వేడుకలను ప్రభుత్వ నిధులతో నిర్వహించారు. నిరుద్యోగులను మోసం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఉద్యమకారులను గుర్తించలేదు. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్.. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఉద్యమకారులను గుర్తించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఉద్యమ సమయంలో ఆంధ్రా పత్రికల యాజమాన్యాలను ఎదిరించి ఉద్యమం ఉవ్వెత్తున లేచేందుకు కృషిచేసిన జర్నలిస్టులకు ఈ ప్రభుత్వం న్యాయంచేయాలి.
మరాఠి శివప్రసాద్,
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జేఏసీ విద్యార్థి విభాగం ఇన్‌చార్జి
ఉద్యమంలో వైకల్యాన్ని లెక్కచేయలే
తెలంగాణ ఉద్యమంలో ప్రతిరోజు పాల్గొన్నా. నాకు వైకల్యం ఉన్నప్పటికీ తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో ఉద్యమం చేశా. పోలీసులు ఎన్నిసార్లు బెదిరించినా వెనక్కి తగ్గలేదు. ఇంట్లో వాళ్లు చాలా రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా, ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా, ఉద్యమంలోనే పనిచేశా. మా గ్రామ సర్పంచ్ రాజీనామా చేయాలని వాటర్‌ట్యాంకు ఎక్కిన. పోలీసులు, విలేకరులు, అధికారుల సమక్షంలో హామీ ఇచ్చిండు, కానీ రాజీనామా చేయలే. తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు. రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ నాయకులకు మాత్రమే మేలు జరిగింది. రాష్ట్రం సాధించామనే తృప్తి తప్ప మేలు జరిగిన సందర్భం లేదు.
పిడిశెట్టి నారాయణ,
వికలాంగుల హక్కుల పోరాట సమితి సిద్దిపేట జిల్లా కార్యదర్శి
ఉద్యమకారులపై కేసులు ఇంకా ఉన్నాయి
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయనుకున్నాం. కానీ గత ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఈ పదేళ్లలో పూర్తిగా విస్మరించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు ఉద్యమకారులకు వర్తింపజేస్తారని అనుకున్నాం కానీ ఉద్యమకారులను లెక్క చేయలేదు. తెలంగాణ ఏర్పడగానే ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామన్నారు కానీ కేసులు ఇంకా ఉన్నాయి. అమరవీరుల కుటుంబాలకు మాత్రం గత ప్రభుత్వం కొంతమేర అయిన న్యాయం చేయడం సంతోషకరం. ఉద్యమంలో పాల్గొన్న చాలామంది ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని గుర్తించి పెన్షన్ ఇవ్వాలి. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించాలి.
కిందొడ్డి అంజయ్య,
జేఏసీ జాయింట్ సెక్రటరీ, వికారాబాద్
ఏ అంశంలోనూ న్యాయం జరగలేదు
నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాల మీదనే ప్రత్యేక రాష్ట్ర ఉద్య మం కొనసాగింది. పదేళ్లలో ఈ మూడు విషయాల్లో ఎక్కడా న్యాయం జరగలేదు. 42 రోజుల పాటు జరిగిన సకలజనుల సమ్మెలో ప్రైవేటు పాఠశాలల పాత్ర మరువలేనిది. రాష్ట్రం సాధించాలనే ఉద్దేశంతో పోరాటం చేసి సాధించుకున్నాం. నియా మకాలు జరగలేదు.. నీళ్లు రాలేదు.. నిధులు లేక అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమకారులకు మంచి గుర్తింపు ఉంటుందని ఆశించాం. ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయలేదు. దక్షిణ తెలంగాణ పూర్తిగా వెనుకబడి పోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఉద్యమకారులను గుర్తించి, ఉద్యోగాలు భర్తీ చేయాలి.
మంగ నాగయ్య,
ప్రైవేటు పాఠశాలల జేఏసీ జిల్లా కన్వీనర్, వికారాబాద్
ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కోట్లాడినం. తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేండ్లు అవుతున్నా నియామకాలు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు నీళ్ల విషయంలో కూడా ఇబ్బందులు పూర్తి స్థాయిలో తొలగలేదు. శ్రీశైలం ప్రాజెక్టులో న్యాయంగా రావాల్సిన నీటి వాటా తెలంగాణకు ఇంకా రావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు బాగా జరిగింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అభివృద్ధి, సంక్షేమాన్ని అలాగే కొనసాగించాలి.
ఎస్ విజయ్‌గౌడ్,
విద్యార్థి జేఏసీ నియోజకవర్గ అధ్యక్షుడు,
పటాన్‌చెరు, సంగారెడ్డి జిల్లా
ఉద్యమంలో చెప్పినవి కేసీఆర్ 99 శాతం చేసిండు
దేనికోసమైతే కోట్లాడినమో తెలంగాణ వచ్చాక అవి సాధించుకున్నం. ఉద్యమంలో చెప్పినవి కేసీఆర్ 99 శాతం చేసి చూపిండు. కరెంటు, నీళ్లు, రైతుల కష్టాలు అన్నింటినీ తీర్చిండు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉందో ప్రజలకు తెలుసు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు వేయించిండు. అభివృద్ధితో రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు మంత్రిగా కేటీఆర్ ఐటీని అభివృద్ధి చేశారు. రాష్ట్రం వస్తే అల్లర్లు అయితయన్న వాళ్లుకు ప్రశాంత తెలంగాణను చూపిండు. 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయతో చెరువులు, కుంటల పూడిక తీత కేసీఆర్‌తోనే సాధ్యమైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చింది. మద్యంపానం నిషేధం చేస్తామన్నారు. కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొస్తున్నరు.
జీ వెంకటేశంగౌడ్,
తెలంగాణ ఉద్యమకారుడు,
జిన్నారం, సంగారెడ్డి జిల్లా
ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేశారు
తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన టీఎన్జీవో ఉద్యోగ సంఘాన్ని గత పాలకులు నిర్వీర్యం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగుల కోసం ప్రశ్నించిన ఏకైక సంఘం టీఎన్జీవో. కొంతమంది స్వార్థపరులు గత పాలకులకు తొత్తులుగా మారి తెలంగాణ రాష్ట్ర లక్ష్యాన్ని నీరుగార్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగుల బతుకులు మారుతాయని, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని భావిం చాం. కానీ స్వరాష్ట్రంలో ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలను చెల్లాచెదురు చేశారు. నిలదీసిన వారిని అణచివేయాలని ప్రయత్నించారు. కొత్త ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమన్నా తెలంగాణ ఉద్యోగుల సంఘాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలి.
జావెద్ అలీ,
టీఎన్జీవో అధ్యక్షుడు, సంగారెడ్డి
త్యాగాలు చేసినా ఆశయాలు నెరవేరలేదు
తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి, మలిదశలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత ఎంతో కీలకపాత్ర పోషించారు. ఊరూరా తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి, ఇంటింటా రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని విద్యార్థుల ద్వారా చెప్పించిన ఘనత ఉపాధ్యాయులదే. అయితే ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదు. అమరవీరుల త్యాగానికి గుర్తింపు లేకుండా పోయింది. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. వారు మాత్రం రాజకీయ పదవులు అనుభవించారు. ఇప్పటి ప్రజా ప్రభుత్వమైనా నిరుద్యోగులు, ప్రజల ఆశయాలను నెరవేర్చాలి. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందని ఆశిస్తున్నాం.
పంతులు రాజు,
పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి,
పాపన్నపేట






