14-07-2025 12:12:34 PM
హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రాంతంలోని చుట్టుపక్కల ఉన్న కల్తీ కల్లు ఘటనలో(Kukatpally Adulterated Toddy) మరొకరు మృతిచెందారు. హైదర్ నగర్ కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. హైదర్ నగర్ లో నివాసం ఉండే పుట్టి గంగమణి సోమవారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రిలో(Gandhi Hospital) చికిత్స పొందుతున్న మృతిచెందింది. “ఈరోజు ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 16. ఒక రోగి గంగామణి మరణించింది. ముగ్గురు రోగులు వైద్య సలహాకు వ్యతిరేకంగా వెళ్లిపోయారు. 4 మంది రోగులను ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు" అని ఆసుపత్రి అధికారులు సోమవారం తెలిపారు.
కూకట్‌పల్లి ఘటన మరవక ముందే మేడ్చల్ జీడిమెట్ల రామ్ రెడ్డినగర్(Jeedimetla Ram Reddy Nagar)లో కల్తీకల్లు కలకలం రేగింది. ఆదివారం నిజామాబాద్ కు చెందిన దంపతులు జీడిమెట్లలో కల్లు తాగారు. దంపతులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రాష్ట్ర టాస్క్ ఫోర్స్ (State Task Force) భారీ దాడులు చేపట్టి, చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌లు లేకుండా కల్లు అమ్మకం,రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసింది. ఈ ఆపరేషన్ల ఫలితంగా హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో మూడు వేర్వేరు కేసుల్లో 420 లీటర్ల కల్లు, ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లిలో ఇటీవల కల్తీ కల్లు వినియోగం వల్ల అనేక మంది మరణాలు, అనేక మంది ఆసుపత్రి పాలైన సంఘటనల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఇది నగరం అంతటా తీవ్రమైన ప్రజా భద్రతా సమస్యలను లేవనెత్తింది.