14-07-2025 05:49:57 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి పట్టణంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన దివంగత సీపీఐ నేత గుండా మల్లేష్ 79వ జయంతిని వైభవంగా జరిపారు. బెల్లంపల్లి బజార్ ఏరియాలో గుండా మల్లేష్ విగ్రహానికి సీసీఐ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. అమరజీవి కామ్రేడ్ గుండా మల్లేష్ ఆశయ సాధన కోసం పట్టణ పార్టీ ఎల్లవేళల కృషి చేస్తుందన్నారు. పట్టణంలో పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అందరూ కృషికి కంకణ బద్దులు కావాలనీ పిలుపునిచ్చారు. తుదిశ్వాస వరకు బడుగు బలహీన పేద వర్గాల ప్రజలు, సింగరేణి కార్మికుల కోసం అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడారు. భూమిలేని వారికి భూమి, ఇల్లు లేని వారికి ఇండ్లు పంచారన్నారు. బూటకపు ఎన్కౌంటర్లపై గలమెత్తిన ఏకైక నాయకుడు గుండా మల్లేష్ అని పేర్కొన్నారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అవినీతికి తావు లేకుండా నిస్వార్ధంగా ప్రజా శ్రేయసుకు గుండా మల్లేష్ అంకితమై పని చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను సీపీఐ పార్టీ శాసనసభ పక్ష నేతగా తెలంగాణ వాదాన్ని వినిపించారని తెలిపారు. రాష్ట్ర సాధనలో శక్తివంచనలేకుండా పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్, సీసీఐ రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు గుండా సరోజ, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, బి కే ఎం యు జాతీయ సమితి సభ్యులు అక్క పెళ్లి బాబు, సీపీఐ బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతుల లక్ష్మీనారాయణ, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు బొల్లం సోని, పట్టణ నాయకులు శంకర్ ,స్వామి దాస్, తిరుమలేష్ గుండ ప్రశాంత్, గుండా శంకర్, సందీప్, కమల, పద్మ తదితరులు పాల్గొన్నారు.