14-07-2025 05:28:08 PM
నల్లగొండ పార్టీ కార్యకర్తల ప్రాణ త్యాగం వెలకట్ట లేనిది..
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్ర రావు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణలో రానున్నది బీజేపీ సర్కారేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరపరాజు రాంచందర్(Telangana State President Ramchander Rao) చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ లో భాజాపా ముఖ్య కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుటుంబ పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలన్నారు. సోనియా గాంధీ కుటుంబ పాలనను తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ దేశం కోసం, ప్రజల కోసం పని చేస్తుందని చెప్పారు. ఇతర పార్టీలు తన కుటుంబ సభ్యులకు ఆస్తులు కాపాడుకోవడం కోసమే పనిచేస్తారని విమర్శించారు.
భాజపా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ప్రజల్లో కలిసి వారి కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అవినీతి పార్టీలకు చిమర గీతం పాడాలన్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ నేతృత్వంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని తెలంగాణలో కూడా త్వరలో అధికారం చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా ఆయన వెలిబుచ్చారు. తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులని వీరి చైతన్యంతో ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ రాజకీయాల్లో నల్లగొండ జిల్లా రాజకీయ చైతన్యం కలిగిందని, ఈ చైతన్యంతో ఇక్కడి నుండే ఉద్యమాలను మొదలు పెడుతున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ కోసం నల్గొండ జిల్లాలో అనేక మంది కార్యకర్తలు ప్రాణ త్యాగం చేశారని, వారి త్యాగం వృధా కాదని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని, నల్లగొండ జిల్లాలో అపూర్వ సోదరులకు, తండ్రి కొడుకులకు ఇతర నాయకులకు సమర గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి అక్రమాలలో కోరుకుపోయిందని, ఫోన్ టాపింగ్, భూమాపియా వంటి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని విమర్శించారు. తెలంగాణలో రాజకీయ పోరాటాలు నల్లగొండ నుండి మొదలుపెట్టి కాషాయ జండా ఎగరవేస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో రైతుల కొరకు యూరియా 9 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా, 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం పంపిస్తే, రైతులకు పంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళారులకు పంచిందని అన్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ ఇవ్వకుండా రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చెప్పారు. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి తదితరులు ప్రసంగించారు. సీనియర్ నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, చింతా సాంబమూర్తి, మాధగోని శ్రీనివాస్ గౌడ్,గోలి మసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్, పెళ్లి రామరాజు యాదవ్, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.