calender_icon.png 7 December, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం ఇంజినీర్లపై చర్యలేవీ?

07-12-2025 01:07:50 AM

 షోకాజ్ నోటీసులతోనే సరి!

  1. మొదట్లో బాధ్యులిందరూ.. క్రిమినల్ కేసులంటూ హడావిడి
  2. పెనాల్టీలు వేసేలా ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ ఫ్రేం చేయాలని సూచనలు 
  3. వివరణలు తీసుకుని చల్లబడిన నీటిపారుదల శాఖ
  4. ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ ఫ్రేం ఊసెత్తని అధికారులు
  5. చర్యలకు విముఖత చూపుతున్నట్లు సొంత శాఖలోనే చర్చ
  6. కోల్డ్‌స్టోరేజీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ నివేదికలు? 
  7. చర్యలపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టేనని అనుమానాలు

 హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ‘కొండంత రాగం తీసి.. తస్సుమన్న’ చందం గా వ్యవహరిస్తోందనే చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికతోపాటు విజిలెన్స్ నివేదిక సై తం బయటకు వచ్చిన నేపథ్యంలో ఇందుకు బాధ్యులైన ఇంజినీర్లపై కొరడా ఝుళిపించే అవకాశం ఉన్నట్టుగా అందరూ భావించా రు. ప్రస్తుతం ఆ దిశగా శాఖాపరంగా ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నట్టు కనపడటం లేదు.

కారణం.. హడావిడిగా బాధ్యులైన ఇం జనీర్లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన నీటిపారుదల శాఖ.. వారి నుంచి వివరణలు తీసుకుని చప్పున చల్లబడి పోయింది. దీని తో ఇకపై చర్యలు ఉంటాయా అంటే నమ్మ కం కలగట్లేదు. వివరణలు తీసుకుని దాదా పు ఐదారు నెలల కాలం గడుస్తున్నా తదుపరి చర్యలపై ఎలాంటి కదలికలు లేకపో వడంతో ప్రభుత్వం వెనకడుగు వేసినట్టుగానే ఇంజినీర్లలోనే చర్చ జరుగుతుండటం గమనార్హం.

ప్రారంభంలో సంచలనం..

అటు రాజకీయంగా.. ఇటు అధికారవర్గంలోనూ తీవ్ర సంచలనం సృష్టించిన కాళేశ్వ రంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, అలాగే విజిలెన్స్ నివేదికలు బయటకు వచ్చిన నేపథ్యంలో జరిగిన హడావిడి  అంతా ఇంత కాదు. అటు రాజకీయ నేతల్లోనూ.. ఇటు అధికార యంత్రాంగంలోనూ.. మరోవంక నీటిపారుదల శాఖ ఇంజనీరింగు విభాగంలోనూ అటు తరువాత ఏం జరుగుతుంది? అనే ఆందోళన, ఉత్కంఠ వ్యక్తమయ్యింది.

ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నట్టు మొదట్లో బాగానే హడావిడి చేసింది. దీనికితోడు రాజకీయం గా మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు న్యాయస్థా నాలను సైతం ఆశ్రయించారు. అక్కడి నుం చి కాస్త వెసులుబాటు కల్గించేలా ఆదేశాలు రావడంతో.. ఇటు శాఖా పరమైన చర్యల్లో వేగం మందగించిందనే చర్చ సాగుతోంది.

క్రిమినల్ కేసులంటూ..

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలోనూ.. మరోవంక విజిలెన్స్ నివేదికలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లందరి పేర్లను ఉదహ రించారు. వీరందరికీ బాధ్యతలు ఉన్నాయని కూడా ఆయా నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సుమారు 30మందికిపైగా ఇంజినీ ర్లకు నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులను జారీచేసింది. విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నట్టు.. తీవ్రమైన ఆరోపణలు ఉన్న 17మంది ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని సూచించింది.

ఇందులో మాజీ ఈఎన్‌సీ నుంచి మొదలుకుని.. ఎస్ ఈ వరకు ఉన్నారు. ఇందులోని కొంతమంది ఇంజనీర్లతో కలుపుకుని మొత్తం 33 మందిపై పెనాల్టీలు వేసేలా ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ ఫ్రేం చేయాలని కూడా విజిలెన్స్ కమిషన్ సూచించింది. దీనితో పాటు మరో ఏడుగురు రిటైర్డ్ ఇంజినీర్లపై పెనాల్టీ వేసేలా ఛార్జెస్ ఫ్రేం చేయాలని కూడా సూచించింది. అలాగే.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కూడా ఒక్కొక్క ఇంజనీరు పేరును ఉదహరిస్తూ.. వారి బాధ్యతలను కూడా గుర్తు చేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో.. ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న ఈఈలు, ఎస్‌ఈలు, సీఈలు, అలాగే సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) ఇంజినీర్లతోపాటు ఈఎన్‌సీ లపై కూడా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచించింది. ఇలా బాధ్యులైన వారందరికీ నీటిపారుదల శాఖ నోటీసులు సుమారు ఆరు నెలల క్రితమే పంపించింది.

గడువు లోగా వారందరి నుంచి నీటిపారుదల శాఖ కు వివరణలు కూడా అందాయి. బాధ్యులైన ఇంజినీర్ల నుంచి వివరణలు తీసుకున్న నీటిపారుదల శాఖ వారిపై చర్యలు తీసుకో వడానికి విముఖత చూపెడుతున్నట్టు సదరు శాఖలోనే చర్చ జరుగుతోంది.

ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ ఎప్పుడు..?

నిబంధనల ప్రకారం.. బాధ్యులైన ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన నీటిపా రుదల శాఖ.. వారి నుంచి వచ్చిన వివరణలను పరిశీలించాలి. తరువాత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ నివేదికల ప్రకా రం.. ఏయే అంశానికి ఎవరు బాధ్యులనే దానిని పరిగణనలోకి తీసుకుని.. వారి వివరణను పరిశీలించి బాధ్యులపై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ రూపొందించాల్సి ఉంటుంది. కానీ ఇంజనీర్ల నుంచి వివరణలు వచ్చి సుమారు ఐదారు నెలల కాలం గడుస్తోంది.

ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న సంకేతాలు కూడా రావడం లేదు. వాస్తవానికి మొదట్లో జరిగిన హడావిడి చూస్తే.. వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం కనపడింది. చర్యలు తీసుకోవాలి కూడా. అయితే ఐదారు నెలల కాలం గడుస్తున్నా.. ఇప్పటికీ అటువైపు దృష్టి సారించిన ట్టుగా కనపడటం లేదు. అసలు ఆ ఆలోచన ఉందా అనే దానిపై కూడా అనుమానం కలుగుతోంది.

నిస్తేజంగా..

నిజానికి ఇప్పటికే ఎన్నడో ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ ఫ్రేం చేసి ఉండాల్సిందని నీటిపారుదల శాఖలోని ఉన్నతాధికారులు, ఇంజినీరింగు విభాగంలోని సి బ్బంది సైతం అంటున్నారు. కానీ రాజకీయంగా వచ్చిన ఒత్తిడి వల్లనో.. లేక ఇంజినీర్లపై చర్యలు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వ పెద్దలకు లేకపోవడం వల్లనో ఈ ప్రక్రియను మధ్యలోనే వదిలేశారేమోననే అనుమానాలు సొంత శాఖ నుంచే వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతానికి ఎలాంటి కదలిక లేకపోవడంతో.. చర్యలు ఇప్పుడప్పుడే ఉండవనే నిర్ణయానికి నీటిపారుదల శాఖ ఉద్యోగులు వచ్చేశారు. ఈ చర్యల కొరడా ఝుళిపించాలంటే.. సీఎం స్థాయిలో కదలిక రా వాలని, అప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, విజిలెన్స్ నివేదికలకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుందని వారంటున్నారు. లేకపోతే.. గతంలో చాలా విషయాల్లో వచ్చిన నివేదికల మాదిరిగానే ఇవి కూడా కోల్డ్‌స్టోరేజీలో పెట్టేసిన ట్టుగానే భావించాల్సి ఉంటుందని సొం త శాఖలోనే చర్చ సాగుతోంది.