07-01-2026 04:30:16 PM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన జలవివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu) మరోసారి స్పందించారు. నీళ్లపై రాజకీయాలు చేయొద్దని తెలంగాణ నేతలను చంద్రబాబు కోరారు. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులను తానే ప్రారంభించానని చెప్పారు. జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగరకు ఇచ్చామని తెలిపారు. పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదని హితువు పలికారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు(Telangana people) కూడా ఆలోచించాలని కోరారు. దేవాదులను మందుకు తీసుకెళ్లండి.. ఎవరు వద్దన్నారు? అని సీబీఎన్ ప్రశ్నించారు. తెలుగుజాతి ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకొనే వైఖరి ఉండాలని కోరారు. గతంలో హైదరాబాద్ లో వారానికి ఒకసారి నీళ్లు వచ్చేవని చంద్రబాబు గుర్తుచేశారు. నాగార్జునసాగర్ నుంచి నీళ్లు తెచ్చి హైదరాబాద్ కు ఇచ్చామని ఆయన వెల్లడించారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని ఏపీ సీఎం వెల్లడించారు. 2020 నాటికి పూర్తి కావలసిన పోలవరం ప్రాజెక్ట్, వైసీపీ ప్రభుత్వం రాకతో వారి చేతకానితనం వల్ల పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) నిర్మాణం పూర్తిచేయడంలో ఆరేడేళ్లు జాప్యం జరిగిందని సీబీఎన్ ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సమీక్షలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. సమీక్షకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. ప్రాజెక్టులో 87 శాతం మేర సివిల్ పనులు పూర్తి అయ్యాయని, గడువులోగా మిగతా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలన్నారు. పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని పని చేయాలన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కుడికాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు కూడా నీరు వెళ్లేలా ప్రణాళికలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మే మొదటి వారంలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల్ని తనిఖీ చేస్తానని ఏపీ సీఎం అధికారులకు సూచించారు.