08-01-2026 06:45:14 PM
ఉప్పల్,(విజయక్రాంతి): హబ్సిగూడా ప్రధాన రహదారిలోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్ భవంతిలో ఇంటర్ బోర్డ్ అనుమతులు లేకుండా అక్రమంగా మొదటి, రెండవ ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్న విద్యా పీట్(ఫిసిక్స్ వాలా) అనధికార కళాశాలపై చర్యలు తీసుకోవాలని, కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం నాడు హబ్సిగూడా లోని అనధికార విద్యా పీట్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ ఇంటర్ బోర్డునే ధిక్కరించేలా వ్యవహరిస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న విద్యాపీట్ లాంటి బోగస్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోకపోతే విద్యాశాఖపై, అధికారులపై నమ్మకం పోతుందన్నారు. కళాశాల అనుమతులు ఒక దగ్గర,అడ్మిషన్లు ఒక దగ్గర తరగతులు ఒక చోట నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు.
ఇంటర్మీడియట్ కోర్సులకు లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూళ్లు చేస్తున్నా, నిర్వహణలో మోసపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాకాధికారి తక్షణమే ఈ అనధికార కళాశాలను పరిశీలించాలని, సదరు కళాశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు తో ఆటలాడుతున్న కార్పొరేట్ కళాశాలల ఆగడాలను కట్టడి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉన్నదని లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మరిన్ని అనధికార కళాశాలలపై పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.