calender_icon.png 22 October, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిడ్నాప్ కాల్స్‌తో సైబర్ వల

22-10-2025 01:50:10 AM

-పిల్లల పేర్లు చెప్పి బెదిరింపులు 

-అత్యంత అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్

 హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. బేరసారాలొద్దు, చెప్పినంత డబ్బు మా ఖాతాలో వేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయి’. ఇలాంటి బెదిరింపు కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు నగరంలో కొత్త తరహా దోపిడీకి తెరలేపారు. తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని, వారిని మానసికంగా క్రుంగదీసి డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషన ర్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.

ఈ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయన అన్నారు. సైబర్ నేరగాళ్లు తల్లి దండ్రులను మోసగించడానికి భయం అ త్యాశ అనే రెండు బలహీనతలను ఆయుధాలుగా వాడుకుంటున్నారని సీపీ స్పష్టం చేశా రు. పోలీసులమని పరిచయం చేసుకొని, మీ పిల్లలను కిడ్నాప్ చేశాం అంటూ కాల్ చేస్తారని, నమ్మకం కలిగించడానికి పిల్లల పేర్లను కచ్చితంగా చెప్పడమే కాకుండా, వారు ఏడుస్తున్నట్లుగా ఉన్న శబ్దాలను వినిపించి ఆందోళనకు గురిచేస్తారని వివరిం చారు.

ఇలాంటి సమయంలో కంగారుపడి, వారు అడిగిన డబ్బును ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తే మోసపోయినట్లేనని ఆయన హెచ్చరించారు.ఈ తరహా మోసాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని సీపీ సజ్జనార్ పునరుద్ఘాటించారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు తక్షణమే కాల్ చేయాలి. లేదా http://cybercrime. gov.in వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని సీపీ సజ్జనార్ సూచించారు.